తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబునాయుడు ఇవాళ్టినుంచి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. విజయవాడలోని కెల్ యూనివర్సిటీ ప్రాంగణంలో మొత్తం సుమారు 250 మంది తెదేపా ప్రజాప్రతినిధులకు ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. మూడురోజుల పాటూ ముమ్మరంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు.
అయితే ప్రజాప్రతినిధులకు శిక్షణ అంటే ఏమిటి? దీనికి ఎవరి నిర్వచనం ఎలాగైనా ఉండొచ్చు గానీ.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం మాత్రం ప్రధానంగా.. ప్రభుత్వానికి అనుకూల ప్రచారం నిర్వహించడం, అలాగే, ప్రత్యర్థుల విమర్శలనుంచి ఆత్మరక్షణ దిశగా సంసిద్ధం కావడం అనే కోణంలోనే శిక్షణ షెడ్యూలు తయారుచేసినట్లు తెలుస్తోంది.
కేంద్రంనుంచి పుచ్చుకుంటున్న ప్యాకేజీ ఏ రకంగా గొప్పది? ఎలా దాన్ని గురించి ప్రజలకు పాజిటివ్‌గా చెప్పాలి? విమర్శల్ని ఎలా తిప్పికొట్టాలో ఇందులో నేర్పుతారు.
అయితే పనిలో పనిగా చంద్రబాబు నాయుడు సర్కారు పరిపాలనలో వాడుతున్న అత్యాధునిక సాంకేతిక విప్లవం గురించి కూడా తెలియజెప్తారు. డాష్‌బోర్డు టెక్నాలజీ వినియోగం, టెక్నాలజీ ని వాడుకుని ప్రజల్లోకి చొచ్చుకుపోవడం వంటి వాటి గురించి శిక్షణలో వివరిస్తారని తెలుస్తోంది.