Cold Winds : చలి తగ్గదట.. వాతావరణ శాఖ మరో బాంబు పేల్చిందిగా?
ఆంధ్రప్రదేశ్, తెలగాణలలో మరో రెండు రోజుల పాటు చలితీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతుంది
చలితీవ్రత రోజురోజుకూ ఎక్కువవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే గడ్డకట్టుకుని పోతున్న పరిస్థితి నెలకొంది. ఈ చలితీవ్రత కారణంగా అనేక మంది ప్రజలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలగాణలలో మరో రెండు రోజుల పాటు చలితీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతుంది. అలాగే మరింత కనిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలపడంతో మరొక రెండు రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. పొగమంచు అలుముకుంటోంది. దట్టమైన పొగమంచుతో వాహనదారులను ఇబ్బందులు పెడుతుంది. వాహనాలు లైట్లు వేసుకుని మరీ రావాల్సిన పరిస్థితులు ఉదయం తొమ్మిది గంటల వరకూ ఉంటాయి.
వరస సెలవులు రావడంతో...
ఇక ఆంధ్రప్రదేశ్ లో చలితీవ్రత కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధానంగా ల్లూరి పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత ఎకకువగా ఉంది.దట్టంగా అలుముకున్న పొగమంచును ఎంజాయ్ చేయడానికి అనేక మంది పర్యాటకులు వరుస హాలిడేస్ కావడంతో పర్యాటక ప్రాంతాలకు వస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాలైన పాడేరు, అరకు, లంబసింగి, మారేడుమిల్లి వంటి ప్రాంతాల్లో పర్యాటకులు ఫుల్ గా నిండిపోయిన పరిస్థితి నెలకొంది. మినుములూరులో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అరకులో 6, పాడేరు 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని తెలిపారు. రాత్రి పూట ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశముందని చెబుతున్నారు.
ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసి...
తెలంగాణలోనూ చలితీవ్రత ఎక్కువగా ఉంది. రానున్న రెండు రోజుల్లో ప్రస్తుతం ఉన్న కనిష్ట ఉష్ణోగ్రతల కంటే మరో రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా సంగారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, మెదక్, కామారెడ్డి, కొమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. వీటితో రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, సిద్ధిపేట, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, నాగర్ కర్నూల్, వికారాబాద్, హైదరాబాద్,మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.