Tirumala : పవన్ అభ్యర్థనకు నో చెప్పిన టీటీడీ... కారణమిదే
తిరుమల తిరుపతి దేవస్థానం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభ్యర్థనను తిరస్కరించింది
తిరుమల కొండకు గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఒకప్పుడు సీజన్ లోనే ఉండే రద్దీ ఇప్పుడు వారాలు, సీజన్ తో నిమిత్తం లేకుండా స్వామి వారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. ప్రధానంగా తిరుమలకు వచ్చిన వారు ఒకరోజు శ్రీవారి చెంత గడపాలని కోరుకుంటారు. కానీ తిరుమల కొండపై ఏడు వేల గదులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వచ్చే వారి సంఖ్య రోజుకు డెబ్భయి నుంచి ఎనభై వేలకు పైగానే ఉంది. వీవీఐపీ, అత్యంత ఖరీదైన వసతి గృహాలను పక్కన పెడితే సామాన్యులు ఉండే వసతి గృహాలు అంత సులువుగా దొరికే పరిస్థితి ఉండదు. దీంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తిరుమల కొండపై సొంతంగా గెస్ట్ హౌస్ నిర్మించాలని కోరినా అందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అంగీకరించలేదు.
గతంలో అనుమతులిచ్చినా...
తిరుమలలో స్థలం కేటాయింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమతం్రి పవన్ కళ్యాణ్ చేసిన అభ్యర్థనను తిరుమల తిరుపతి దేవస్థానం తిరస్కరించింది. అలాగే మంత్రి అనగాని సత్యప్రసాద్ కూడా కోరారు. తిరుమల కొండపై సొంతంగా అతిథి గృహాలు నిర్మించడానికి గతంలో అనుమతులు ఇచ్చేవారు. భూమి కూడా కేటాయించేవారు. కాటేజీ నిర్మించినా అది టీటీడీకే ఇవ్వాల్సి ఉంటుంది. స్థలాలు లేకపోవడంతో కాటేజీలు నిర్మించేందుకు ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. తిరుమల కొండపై విస్తీర్ణ పరంగా చూస్తే చాలా పరిమితంగా ఉంది. కొత్త నిర్మాణాలకు చోటు లేకపోవడమే కాకుండా, ఉన్న స్థలాన్ని కేవలం సామాన్య భక్తుల వసతి కోసమే ఉపయోగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది.
తక్కువ విస్తీర్ణం కావడంతో...
తిరుమలలో పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి, కొత్తగా ప్రైవేట్ లేదా వ్యక్తిగత కట్టడాలకు అనుమతి ఇవ్వకూడదని గతంలోనే నిర్ణయించారు. సాధారణంగా ఎవరైనా దాతలు ఇక్కడ భవనాలు నిర్మించాలనుకుంటే, వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళం ఇవ్వాలి. ఆ భవనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానమే నిర్మిస్తుంది. దాతకు కేవలం సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే అక్కడ ఉండే హక్కు ఉంటుంది. తిరుమలలో వ్యక్తులకు లేదా ప్రైవేట్ సంస్థలకు భూములు ఇచ్చేలా నిబంధనలను మార్చడం లేదు. పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాన్ని సానుకూలంగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీటీడీ పాతబడిన అతిథి గృహాలను కూల్చివేసి, వాటి స్థానంలో అత్యాధునిక వసతి సముదాయాలను నిర్మిస్తోంది. ఈ క్రమంలో వ్యక్తిగత దాతల పేర్లను కూడా తొలగించి, ఆధ్యాత్మిక పేర్లను పెడుతున్నారు. జిఎంఆర్ గెస్ట్ హౌస్‌ను ఆనంద నికేతనంగా మార్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరొకవైపు భక్తుల రద్దీ పెరగడంతో కొండ కింద అలిపిరి వద్ద కొన్ని వసతిగృహాలను నిర్మించాలని తలపెట్టింది. అందుకే పవన్ కల్యాణ్ అభ్యర్థనను టీటీడీ తిరస్కరించింది. దీనికి పవన్ కూడా సుముఖత వ్యక్తం చేశారు.