Tirumala : నేడు తిరుమల కొండకు వెళ్లే వారికి అలెర్ట్

తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది.

Update: 2025-12-29 03:04 GMT

తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతుంది. డిసెంబరు మాసం చివర కావడంతో ఈ ఏడాది చివరి వారంలో దర్శనానికి కొండకు భక్తులు బారులు తీరుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. స్వామి వారి దర్శనానికి గంటల సమయం పడుతుంది. క్యూ లైన్లలోనూ, కంపార్ట్ మెంట్లలోనూ భక్తులు నిండిపోయి కనిపిస్తున్నారు. గత వారం రోజుల నుంచి శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వచ్చే నెల చివర వరకూ రద్దీ ఇలాగే కొనసాగుతుందని అంచనాలు వేస్తున్నారు.

రేపటి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలకు...
రేపటి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలను ప్రారంభం కానున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుమల లో తొలి మూడు రోజులు టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం లభించనుంది. ప్రముఖుల పార్కింగ్ ప్రదేశాలు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను టీటీడీ ఏర్పాటు చేసింది. తిరుపతి రైల్వేస్టేషన్, బస్టాండ్, నడక మార్గాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. లక్షలాది సంఖ్యలో భక్తులు నేటి నుంచి తిరుమలకు పోటెత్తుతుండటంతో దాదాపు 2500 మంది పోలీసులతో కొండ మీద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పదమూడు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదమూడు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటలకుపైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలుచేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలకుపైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 85,823 మంది భక్తులు దర్శించుకున్నారు. వ వీరిలో 23,660 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.80 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News