Telangana : వింటర్ సెషన్స్ నేటి నుంచి హాట్ హాట్ గా
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. చలి కాలంలో జరుగుతున్న ఈ సమావేశాల్లో వాడివేడిగా సమావేశాలు జరగనున్నాయి. నీటి లెక్కలను తేల్చడానికే ప్రధానంగా అధికార పక్షం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కనిపిస్తుంది. ఇటీవల తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశంలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక చర్చను నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. కేవలం ఈ ఒక్క ఎత్తిపోతలఅ పథకం మాత్రమే కాకుండా నీటిపారుదల రంగంలో అన్ని ప్రాజెక్టుల నీటి కేటాయింపులు.. ఏ ప్రభుత్వ హయాంలో ఎంత నీటి కేటాయింపులు జరిగాయి? ఎన్ని ఎకరాలకు సాగయిందన్న దానిపై కూడా అధికార, ప్రతిపక్ష పార్టీలు చర్చించాలని భావిస్తున్నాయి.
నేడు అసెంబ్లీకి కేసీఆర్...
అయితే నేడు తెలంగాణ అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ రెండేళ్లలో కేసీఆర్ రెండు సార్లు మాత్రమే సభకు హాజరయ్యారు. ఈరోజు హాజరయితే మూడోసారి అసెంబ్లీకి వచ్చినట్లవుతుంది. కానీ నేడు పెద్దగా ఏ అంశంపై చర్చలుండవు. కేవలం మృతి చెందిన శాసనసభ్యులకు సంతాపాన్ని ప్రకటించి సమావేశంలో ప్రభుత్వంలో కీలక బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించుకునే అవకాశాలున్నాయి. ఈరోజు సమావేశం ముగిసిన తర్వాత తిరిగి జనవరి రెండో తేదీ నుంచి సమావేశాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడే నీటిపారుదలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. బీఏసీ సమావేశంలో ఎన్ని రోజులు సభను నిర్వహించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటారు.
అన్ని అంశాలపై చర్చించేందుకు...
మరొకవైపు హిల్ట్ పాలసీ, మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ వంటి వాటిపై ప్రభుత్వం చర్చించే అవకాశాలున్నాయి. హెల్త్ పాలసీ, ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టనున్న వివిధ నీటి ప్రాజెక్టులపై విపక్షాలు చర్చించేందుకు పట్టుబట్టే అవకాశముంది. ప్రధానంగా సంక్షేమ రంగంపై కూడా బీఆర్ఎస్ చర్చుకు పట్టు పట్టాలని బీఆర్ఎస్ భావిస్తుంది. యూరియా, ఎరువులు, విత్తనాల కొరతతో పాటు రైతు భరోసా వంటి పథకాలపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టే అవకాశాలున్నాయి. అన్ని అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధ:గా ఉన్నామని కాంగ్రెస్ నేతలు ప్రతి సవాల్ విసురుతున్నారు. అయితే కేసీఆర్ నేడు ఒక్క రోజు సభకు హాజరై తర్వాత రారా? అన్నది కూడా తేలకుండా ఉంది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై చర్చ జరిగే సమయంలో కేసీఆర్ సభలో ఉండాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. మొత్తం మీద వింటర్ సెషన్ మాత్రం నేటి నుంచి హాట్ హాట్ గా మొదలు కానున్నాయి.