Ys Jagan : జగన్ స్ట్రాటజీలు వర్క్ అవుట్ అవుతున్నాయా?

వైసీపీ అధినేత జగన్ పదకొండు మంది ఎమ్మెల్యేలతోనే అధికార కూటమిని ఇబ్బందులు పెడుతున్నట్లే కనపడుతుంది.

Update: 2025-12-29 07:57 GMT

వైసీపీ అధినేత జగన్ పదకొండు మంది ఎమ్మెల్యేలతోనే అధికార కూటమిని ఇబ్బందులు పెడుతున్నట్లే కనపడుతుంది. 2024 ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్రంలో నలభై శాతం ఓట్లు రావడంతో అంత తేలిగ్గా ఆ పార్టీని తీసి పారేయలేని పరిస్థితి కూటమి నేతలది. పైకి కూటమి నేతలు బింకంగా ఉన్నప్పటికీ తిరిగి జగన్ రాజకీయంగా పుంజుకునే అవకాశాలు లేకపోలేదన్న అనుమానం వారిలో అణువణువు ఉంది. అందుకే వైసీపీ నేతలపై విమర్శలు చేసే మంత్రులు, ఎమ్మెల్యేలు కేవలం వేళ్ల మీద లెక్కపెట్టగలిగిన వారు మాత్రమే ఉన్నారన్నది విశ్లేషకుల అంచనా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూటమి, వైసీపీకి మధ్య పోటీ ఉంటుంది. ఇది ఎవరూ కాదనలేరు.

ఎన్ని శపథాలు చేసినా...
వైఎస్ జగన్ ను తిరిగి అధికారంలోకి రానివ్వబోమని శపథాలు చేసినా గెలిపించేది ప్రజలు మాత్రమేనని ఆ నేతలకు కూడా తెలియంది కాదు. చివరకు ప్రజాభిప్రాయంమేరకే ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కేవలం పదకొండు సీట్లకే వైసీపీ పరిమితం కావడంతో ఇక జగన్ పనిఅయిపోయినట్లేనని భావించారు. కానీ ఓట్ల శాతం చూసిన వారికి మాత్రం ఆ అనుమానం రాకపోయినా.. కూటమిలో ఎక్కువ మంది నేతలు జగన్ ఇక అధికారంలోకి రారని భావించారు. కానీ గత రెండేళ్లలో జగన్ వేస్తున్న అడుగులతో పాటు జగన్ పర్యటనలో ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఒకింత కూటమి పార్టీ నేతల్లోనూ ఆందోళన మొదలయిందనే చెప్పాలి. అందుకే తమకు మరో పదిహేనేళ్లు అధికారం అప్పగిస్తేనే అభివృద్ధి సాథ్యమవుతుందని పదే పదే అడుగుతున్నారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనాగా ఉంది.
ప్రభుత్వ నిర్ణయాలపై...
మరొకవైపు జగన్ ప్రభుత్వ వైద్య కళాశాలల విషయంలో తీసుకున్న నిర్ణయంతో కూటమి ప్రభుత్వం ఒకింత డైలమాలో పడింది. ప్రజల్లో వైద్య కళాశాలలను ప్రయివేటు పరం చేయడాన్ని వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఫీల్డ్ లెవెల్ లో నివేదికలు అందుతున్నాయి. ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి, కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా జగన్ పార్టీ ప్రశ్నిస్తూ వెళుతుంది. జగన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇటీవల జరిగిన హంగామా చూసి క్యాడర్ మొత్తం మళ్లీ యాక్టివ్ అయిందన్న సంకేతాలు అందాయి. అందుకే జగన్ కేవలం మెడికల్ కళాశాల ప్రయివేటీకరణ మాత్రమే కాకుండా రహదారులను పీపీపీ పద్ధతిలో నిర్మించడాన్ని కూడా తప్పుపట్టేలా మరొక కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. అలాగే అన్ని ప్రాంతాల్లో ఆయన పర్యటనలు కూడా ఉండేలా కొత్త ఏడాది ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిసింది. మొత్తం మీద వైసీపీ లో ఊపు కనిపిస్తుంది.


Tags:    

Similar News