Train Accident : రైలులో మంటలు.. ఒకరి సజీవ దహనం

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలులో మంటలు చెలరేగడంతో ఒకరు మృతి చెందారు

Update: 2025-12-29 01:44 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలులో మంటలు చెలరేగడంతో ఒకరు మృతి చెందారు. అనకాపల్లి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. విశాఖపట్నం నుంచి ఎర్నాకుళం వెళ్లే టాటా ఎక్స్ ప్రెస్ లోని ఏసీ బోగీల్లో మంటలు వ్యాపించాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈఘటనతో రైలు ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. రైలులోని ప్యాంట్రీ కారు పక్కనే ఉన్న బీ1, ఎం2 ఏసీ బోగీల్లో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయి. యలమంచిలి సమీపంలో లోకో పైలట్లు రైలుకు మంటలు అంటుకున్న విషయాన్ని గుర్తించి నిలిపివేశారు. నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి రైలు నుంచి కిందకు దూకి తమ ప్రాణాలను రక్షించుకున్నారు.

స్టేషన్ లోకి పరుగులు పెట్టి...
బోగీల్లో నుంచి స్టేషన్ లోకి పరుగులు పెట్టిన ప్రయాణికులకు కొందరికి స్వల్పగాయాలయినట్లు తెలిసింది. అయితే అనకాపల్లికి అప్పటికే నాలుగు గంటలు ఆలస్యంగా చేరుకున్న టాటా ఎక్స్ ప్రెస్ రైలు బోగీలోని బ్రేకులు పట్టివేయడంతోనే ఈ ప్రమాదం జరిగిందని రైల్వే శాఖ అధికారులు ప్రాధమికంగా గుర్తించారు. వెంటనే నక్కపల్లి, యలమంచిలి నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చేందుక ప్రయత్నించారు. దాదాపు దాదాపు రెండు వేల మంది ప్రయాణికులతో వెళుతున్న రైలులో మంటలు రావడంతో ఒక్కసారిగా అందరూ భయాందోళనలకు గురయ్యారు. ఆ మార్గంలో రైళ్లన్నింటినీ చాలా సేపు నిలుపుదల చేశారు. తెల్లవారు జాము నుంచి రూట్ ను క్లియర్ చేశారు.
రైళ్ల రాకపోకలు ఆలస్యం...
ఈ రైలు ప్రమాదంలో టాటా ఎక్స్ ప్రెస్ రైలులోని రెండు బోగీలు పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ప్రమాదంలో బీ1 బోగీలో ఉన్న ఒకరు సజీవదహనమయ్యారు. మృతుడిని విజయవాడకు చెందిన చంద్రశేఖర్ సుందర్ గా గుర్తించారు. ఆయన వయసు డెబ్భయి ఏళ్లు. అనంతరం రైలు ప్రయాణికులను సామర్లకోటకు ఆర్టీసీ బస్సుల్లో తరలరించారు. సామర్లకోటలో మరో రెండు ఏసీ బోగీలను ఏర్పాటు చేసి అక్కడి నుంచి రైలు ఎర్నాకులానికి బయలుదేరి వెళ్లింది. ఈ ఘటనతో విశాఖ నుంచి విజయవాడ వైపు వెళ్లే రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. దట్టంగా పొగ అలుముకోవడంతో తమ లగేజీ అంతా మంటల్లో బూడిదయిందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. రైళ్ల రాకపోకలన్నీ యధావిధంగా నడుస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.





Tags:    

Similar News