Pemmasani Chandra Sekhar : దూసుకుపోతున్న కేంద్ర మంత్రి.. వరస బాధ్యతలను అప్పగిస్తుండటంతో?
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారారు
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారారు. ఆయన గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎంపీగా గెలిచారు. గుంటూరు జిల్లాకు చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాలో ఉంటూ వేల కోట్ల రూపాయలు ఆర్జించారు . తర్వాత ఆయనను టీడీపీ రాజకీయాల్లోకి ఆహ్వానించడంతో తొలిసారి రాజకీయాల్లోకి వచ్చి అత్యున్నత సభ పార్లమెంటులో కాలుమోపారు. తొలిసారి ఎంపీ అయినప్పటికీ ఆయనకు కేంద్ర మంత్రి పదవి లభించింది. ప్రస్తుత పార్లమెంటు సభ్యుల్లో అత్యంత ధనవంతుడు పెమ్మసాని చంద్రశేఖర్. అయితే పెమ్మసాని గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. సొంత నిధులను కూడా వెచ్చించి కొన్ని అభివృద్ధి పనులు చేయడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులను వినియోగిస్తున్నారు.
రైతుల కు సంధానకర్తగా...
పెమ్మసాని చంద్రశేఖర్ కు టీడీపీ అత్యున్నత స్థానం కల్పించే ఉద్దేశ్యంలో ఉన్నట్లు కనిపిస్తుంది. యువకుడు కావడంతో పాటు సామాజిక సేవలపై అవగాహన ఉండటంతో ఆయనకు మర్ని బాధ్యతలను అప్పగించేందుకు సిద్ధమయింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని పనుల విషయంలోనూ ఆయనను భాగస్వామిగా చేశారు. ప్రధానంగా రెండో విడత భూ సమీకరణ విషయంలో పెమ్మసాని చంద్రశేఖర్ ను రంగంలోకి దించారు. నారాయణ, శ్రావణ్ కుమార్ వల్ల కాదని భావించిన చంద్రబాబు పెమ్మసానిని భాగస్వామ్యుడిని చేయడంతో ఒకింత రైతులు ముందుకు వస్తున్నారని అంటున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ కూడా ప్రతి శనివారం రాజధాని రైతుల సమస్యలతో భేటీ అవుతున్నారు.
శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ను...
పెమ్మసాని చంద్రశేఖర్ మరో కీలకమైన బాధ్యతను భుజానకెత్తుకున్నారు. అది శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ వంతెన ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గుంటూరు తూర్పు, పశ్చిమ ప్రాంత ప్రజలకు ఇది ఉపయోగపడుతుంది. అదే సమయంలో ట్రాఫిక్ సమస్యలను కూడా పరిష్కరించినట్లవుతుంది. కేంద్ర ప్రభుత్వం నిధులను తెచ్చి శంకర్ విలాస్ ఫ్లై ఓవర్ వంతెన నిర్మాణాన్ని వీలయినంత త్వరగా పూర్తి చేయాలని పెమ్మసాని చంద్రశేఖర్ తరచూ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు ప్రజలకు అసౌకర్యం కలగకుండా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశిస్తున్నారు. గతంలో ఎంతోమంది వచ్చినా ఇక్కడ చెయ్యడానికి ధైర్యం కూడా చెయ్యని పనులు పెమ్మసాని చంద్రశేఖర్ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.