Pawan Kalyan : ఇప్పటంలో హంగామా.. మందడం మౌనమేల... సారూ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలో ఉన్నప్పుడు మరొకలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది

Update: 2025-12-28 07:43 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా.. అధికారంలో ఉన్నప్పుడు మరొకలా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటంలో రహదారుల వెడల్పు కోసం నాటి వైసీపీ ప్రభుత్వం కొన్ని ఇళ్లను కూలదోసిన సమయంలో పవన్ కల్యాణ్ నాడు అక్కడకు వెళ్లి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రహదారులను వెడల్పు చేయడానికే నాటి వైసీపీ ప్రభుత్వం కూలదోయడానికి ప్రయత్నించింది. వారికి సంఘీభావం తెలపడమే కాకుండా ఇటీవల ఇప్పటం వెళ్లి ఇళ్లు కూలిపోయిన వారిని పవన్ కల్యాణ్ ఓదార్చారు. వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వారంతా జనసేనకు చెందిన వారుగా అప్పట్లో ప్రచారం జరిగింది.

నాటి వైసీపీ ప్రభుత్వం...
అయితే ఇదే సమయంలో మందడంలో కూడా రహదారుల నిర్మాణం కోసం వంద ఇళ్లను నేటి ప్రభుత్వం కూలదోయడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రభుత్వం వేరే చోట వారి ఇంటి నిర్మాణాలకు స్థలాలను కేటాయిస్తామని హామీ ఇచ్చింది. రాజధాని అమరావతిలోకి రావడానికి ఇళ్లతో పాటు కొన్ని ప్రార్థనాలయాలను కూడా కూలదోసేందుకు కూటమి ప్రభుత్వం అన్నిసిద్ధం చేసింది. ఇంటి యజమానులకు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే తమ ఇళ్లను కూలదోసి ప్రత్యామ్నాయంగా ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఇవ్వడమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. నిన్న మందడంలో మంత్రి నారాయణను ప్రశ్నిస్తూ రామారావు అనే రైతు కుప్పకూలి గుండెపోటుతో మరణించారు.
మందడంలో మాత్రం...
కానీ పవన్ కల్యాణ్ ఇప్పటంపై ఉన్న ఇంట్రెస్ట్.. మందడంపై పెట్టకపోవడం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. కేవలం ప్రభుత్వ నిర్ణయాలను తప్పు పట్టాలంటే ఒకే రకంగా ఉండాలని, ఒకే విధమైన న్యాయాన్ని అన్ని గ్రామాల ప్రజలకు ఉప ముఖ్యమంత్రిగా అందించాలని కోరుతుున్నారు. కానీ కూటమి ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ భాగస్వామి కావడంతో మందడం వైపు ముఖం కూడా పవన్ కల్యాణ్ చూపక పోవడం విమర్శలకు దారి తీస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతంలోని మందడంలోని ఇళ్లు కోల్పోయేవారు కూడా ఇదే రకమైన ప్రశ్నలు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మర్చిపోయారా? అంటూ నిలదీస్తున్నారు.


Tags:    

Similar News