IBomma Ravi : పది కోట్లతో విదేశాల్లో ఏం చేశాడంటే?
ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి
ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. పన్నెండు రోజుల కస్టడీ నేటితో ముగియడంతో ఇమంది రవికి వైద్య పరీక్షలు నిర్వహించి తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు. తాను ఐబొమ్మ, బొప్పం వెబ్ సైట్ ల ద్వారా పదమూడు కోట్ల రూపాయల మేరకు అతని ఖాతాలో పడినట్లు పోలీసులు కనుగొన్నారు. పదమూడు కోట్లలో మూడు కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేసిన పోలీసులు మిగిలిన పదికోట్ల రూపాయల విషయంపై ఆరా తీశారు. అయితే మిగిలిన పదికోట్ల రూపాయలతో విదేశాలు చుట్టి వచ్చి జల్సా చేశానని పోలీసుల విచారణలో ఇమంది రవి చెప్పినట్లు తెలిసింది.
పన్నెండు రోజుల పోలీస్ కస్టడీలో...
పన్నెండు రోజుల కస్టడీలో ఐబొమ్మ రవి అనేక ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ముగ్గురు స్నేహితుల ఫేక్ ఐడెంటిటీతో వెబ్ సైట్లను కొనుగోలు చేసినట్లు రవి పోలీసుల విచారణలో అంగీకరించాడు. కడప జిల్లాకు చెందిన ప్రహ్లాద్ తో 2007లో అమీర్ పేట్ హాస్టల్ ఉన్న సమయంలో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలోనే ప్రహ్లాద్ టెన్త్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ తీసుకున్న రవి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ను పొందినట్లు పోలీసుల విచారణలో అధికారులు కనుగొన్నారు. ఈ విషయాన్ని విచారణలో రవి అంగీకరించాడు. ప్రహ్లాద్ కు తెలియకుండానే తాను ఈ కార్డులను తీసుకున్నానని తెలిపాడు.
ముగ్గురు స్నేహితుల పేర్లతో...
మరొక వైపు ప్లహ్లాద్ ను కూడా పోలీసులు బెంగళూరు నుంచి పిలిపించి విచారించారు. అతను తన పేరుతో రవి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు పొందినట్లు గుర్తించి ఆశ్చర్యపోయారని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో ప్రహ్లాద్ ప్రమేయం ఏమీ లేదని తెలిపారు. మొత్తం ముగ్గురు స్నేహితుల పేర్ల ఫేక్ ఐడెంటిటీతో వెబ్ సైట్లు కొనుగోలు చేసినట్లు చెప్పాడు. అంజయ్య, ప్లహ్లాద్, కాలి ప్రసాద్ ల పేరిట వెబ్ సైట్లు కొనుగోలు చేసినట్లు ఇమంది రవి అంగీకరించాడు. కాలి ప్రసాద్ రవి పదో తరగతి చదివే సమయంలో క్లాస్ మేట్ కావడంతో అతని పేరును కూడా వాడేసుకున్నాడు. ఇమంది రవి విదేశీబ్యాంకుల నుంచి ఎవరెవరి ఖాతాల్లోకి నగదును పంపిన విషయమూ పోలీసులు ఈ విచారణలో సేకరించారు.