Andhra Pradesh : చంద్రబాబుకు మోదీ షాక్ ఇవ్వనున్నారా? అందుకే ఆ నిర్ణయమా?
కూటమి లో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వైఖరి ఇక్కడి రాష్ట్ర నేతలకు మింగుడు పడటం లేదు
కూటమి లో భాగస్వామిగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం వైఖరి ఇక్కడి రాష్ట్ర నేతలకు మింగుడు పడటం లేదు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. ఇతర రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం విజయవాడ మెట్రోకు మాత్రం కొర్రీలు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు నాయుడు సయితం కొంత అసంతృప్తికి గురయ్యారని సమాచారం. విజయవాడ మెట్రో రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా పూనే, జైపూర్ మెట్రో రెండో దశ ప్రాజెక్టులకు అనుమతివ్వడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
డీపీఆర్ పంపినా...
విజయవాడ మెట్రో రైలు కోసం డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును రూపొందించిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపి చాలా రోజులవుతుంది. రెండు క్యారిడార్లలో విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మించాలని తలపెట్టింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఇంత వరకూ అనుమతులు రాలేదు. పైగామిగిలిన మెట్రో ప్రాజెక్టులకు మంజూరు చేయడంపై విజయవాడ మెట్రోపై కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలకు అనేక సందేహాలున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, పూనే వంటి నగరాల్లో మెట్రో రైలు సేవలు అవసరమే. కానీ పట్టుమని పది కిలోమీటర్లు లేని విజయవాడ కు మెట్రో రైలు అవసరమా? అన్న సందేహం కేంద్ర ప్రభుత్వానికి సొంత పార్టీ నేతలే సూచించినట్లు కూటమి పార్టీ నేతల్లో గుసగుసలాడుకుంంటున్నారు.
అనేక అనుమానాలు...
విజయవాడ మెట్రో రైలును ఏర్పాటు చేసినా ఆక్యుపెన్సీ శాతం తక్కువగానే ఉంటుందని భావిస్తున్నారట. అలాగే ట్రాఫిక్ స్డీ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం షరతులతో కొర్రీలు పెట్టడం ఇప్పుుడు ఏపీలో చర్చనీయాంశమైంది. ట్రాఫిక్ స్టడీ పూర్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించడం లేదు. విజయవాడ మెట్రో రైలును 20 : 20 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించేలా, మిగిలిన అరవై శాతం రుణాలను సమీకరించాలని భావించారు. ఇందుకోసం ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణం కోసం అప్పులకు ఓకే చెప్పిన కేంద్రం మరొక అప్పును ప్రజల నెత్తిమీద వేయడానికి అంగీకరించడం లేదా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. అనేక ఆర్థిక సంస్థలు రుణాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం కొర్రీలు వేయడం కూటమి ప్రభుత్వానికి మింగుడు పడటం లేదు. మరి బెజవాడ మెట్రోకు మోక్షం ఎప్పుడన్నది మాత్రం క్లారిటీ లేదు