బాబు చెప్పినవే.. ఇక వాళ్లందరూ చెప్పాలి!

Update: 2016-10-04 15:19 GMT

ఎమ్మెల్యేలకు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులకు మూకుమ్మడిగా శిక్షణ కార్యక్రమం అంటే అందులో ఏం ఉంటుంది? వారికి ఏం నేర్పుతారు? అనే ఆసక్తి అందరికీ సహజంగానే ఉంటుంది. ఎంత సీనియర్లు, ఎంత అనుభవం , ప్రజాదరణ ఉన్న నాయకులకు అయినా.. తనదైన శైలిలో , తాను తలచుకున్న శిక్ష ఇప్పించడానికి చంద్రబాబునాయుడు వద్ద ఎప్పుడూ ఓ సుదీర్ఘమైన యాక్షన్‌ ప్లాన్‌ ఉంటుంది. ఇప్పుడు అమరావతి వద్ద అదే జరుగుతున్నట్లుంది. ఎమ్మెల్యేలకు చంద్రబాబు మార్కు శిక్షణ అందుతోంది.

తొలిరోజు శిక్షణలో చెప్పిన అంశాలను పరిశీలిస్తే.. ఇన్నాళ్లూ చంద్రబాబునాయుడు ప్రజలకు చెబుతూ వచ్చిన రకరకాల అంశాలనే ఇవాళ మళ్లీ అంతే విపులంగా సొంత పార్టీ ప్రజాప్రతినిధులందరికీ వేర్వేరు క్లాసుల్లో తెలియజెప్పారు. అయితే ఇది కేవలం వారు తెలుసుకుని ఆనందించడానికి కాదు, ఇన్నాళ్లూ చంద్రబాబు ప్రజలకు చెప్పిన అంశాలను ఇక మీదట వారే ప్రజలకు చెబుతూ ఉండాలి. తమ తమ నియోజకవర్గాల్లో ఎక్కడ ఎప్పుడు ప్రజలతో మాట్లాడే సందర్భం వచ్చినా సరే.. ఈ అంశాలను వారికి ప్రచారం చేస్తూ ఉండాలన్నమాట. శిక్షణ ద్వారా ప్రభుత్వం అదే కోరుకుంటున్నట్లుంది.

విభజన ఎంత అన్యాయంగా జరిగింది? విభజన ద్వారా ఏపీ ఎంత నష్టపోయింది? కాంగ్రెస్‌ ఎంత దుర్మార్గం చేసింది? అనే ంశాలన్నీ ఒకటో పార్టు. ఇక- ప్రత్యేకహోదా కంటె ప్రత్యేకప్యాకేజీ అనేది రాష్ట్రానికి ఎలా మేలు చేస్తుంది. ప్రత్యేకహోదా ఇవ్వలేని పరిస్థితులు (కాంగ్రెస్‌ వల్ల) ఎలా, ఎందుకు ఏర్పడ్డాయి. ప్యాకేజీ ద్వారా మనం ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతున్నాం? అనేది రెండో పార్టు.

ఇక మూడో పార్టు మన హైటెక్‌ బాబుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. చంద్రబాబునాయుడు రాష్ట్ర పరిపాలనలో కొత్తగా తీసుకువచ్చిన డాష్‌బోర్డు అనగా ఏమిటి? దాని పనితీరు ఏమిటి? దాని ద్వారా.. అభివృద్ధి ఎలా ముడిపడి ఉన్నది? అనే అంశాల్ని ఇవాళ ఎమ్మెల్యేలకు చెప్పారు. అంటే వారు ఇవన్నీ తెలుసుకుని.. చంద్రబాబు కృషి గురించి ఈ వివరాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నమాట.

Similar News