ఒక పేరుమోసిన రౌడీ ఒక ప్రాంతంలో దందా నడిపిస్తూ ఉంటే , అతని సాయం తీసుకోని రాజకీయ నాయకులు, అతనికి దన్నుగా నిలవని నాయకులు సాధారణంగా ఉండరు. అయితే వ్యవహారం బయటపడే వరకు అందరూ పెద్దమనుషులుగానే చెలామణీ అవుతూ ఉంటారు. ఇప్పుడు కబ్జాల మాఫియా డాన్ నయీం ఎన్ కౌంటర్ తర్వాత.. అతనితో అనేకమంది రాజకీయ నాయకులకు కూడా సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అధికార పార్టీ వారు కూడా ఉన్నట్లు తెలియడంతో విచారణ ఎలా సాగబోతున్నదనే అనుమానాలూ వెల్లువెత్తాయి. దీనికి ఫుల్ స్టాప్ పెడుతూ, నయీం కేసును విచారించడానికి ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బ్రుందం సిట్.. నల్గొండ జిల్లాకు చెందిన గులాబీ పార్టీ నేత చింతల వెంకటేశ్వరరెడ్డిని విచారించారు.
నల్గొండ జిల్లాలో పలువురు రాజకీయ ప్రముఖులతో నయీంకు సంబంధాలు ఉన్నట్లు తొలినుంచి వార్తలు వస్తున్నాయి. అయితే అధికార పార్టీకే చెందిన ఒక కీలక నాయకుడిని ఏకంగా మూడు గంటలపాటూ విచారించడం ఇదే ప్రథమం. ఇప్పటికే 72 మంది ఈ కేసులకు సంబంధించి సిట్ అదుపులో ఉన్నారు. ఇంకా 195 మందికి సిట్ పీటీ వారంట్లు జారీ చేసి ఉంది. ఏకంగా అధికార పార్టీ నేతనే విచారించడంతో.. సిట్ దర్యాప్తుకు ఎలాంటి రాజకీయ ప్రతిబంధకాలు లేవని.. వారు దూకుడుగా తమ దర్యాప్తును సాగించబోతున్నారని అర్థమవుతోంది.
చింతల వెంకటేశ్వరరెడ్డిని సుదీర్ఘంగా విచారించిన సిట్.. ఆయన నుంచి అనేక వివరాలు రాబట్టినట్లు తెలుస్తోంది. ఆయన నుంచి రాబట్టిన వివరాలను బట్టి... త్వరలోనే అధికార పార్టీకి, ఇంకా విపక్షాల్లోని పలువురు రాజకీయ నాయకులకు కూడా సిట్ విచారణ తప్పకపోవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు.