తమిళ కన్నడ రగడకు సుప్రీం ఫుల్‌స్టాప్‌ : నీళ్లివ్వాల్సిందే!

Update: 2016-10-04 12:39 GMT

తమ స్వరాష్ట్రంలో నిరసనలు ఎన్ని ఉన్నా సరే.. కన్నడ రాష్ట్రం తమిళనాడుకు నీళ్లు ఇచ్చి తీరాల్సిందే. ఈనెల 7వ తేదీనుంచి 18వ తేదీ వరకు ప్రతిరోజూ 2 వేల క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేసి తీరాల్సిందేనంటూ సుప్రీం కోర్టు మంగళవారం నాడు తాజా ఆదేశాలు ఇచ్చింది. కర్ణాటక రాష్ట్రం కూడా ఈ ఆదేశాలను పాటించడానికి అంగీకరించింది.

కన్నడ తమిళ రాష్ట్రాల మద్య కావేరీ జలాల విడుదల వ్యవహారం రావణ కాష్టంలా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయంలో రెండు రాష్ట్రాలు శత్రుదేశాల స్థాయిలో గొడవపడడం, ఒక ప్రాంతంలో రెండో రాష్ట్రం సామాన్య ప్రజలను కూడా శతృ భావం తో చూడడం మామూలైపోయింది.

దానికి తోడు కర్ణాటకలో రాజకీయ పార్టీలు అన్నీ ఒక్క తాటిపైకి వచ్చి.. తమిళనాడుకు నీళ్లు ఇవ్వడానికి లేదంటూ రభసలు ప్రారంభించాయి. మాజీ ప్రధాని దేవెగౌడ అయితే.. ఏకంగా నిరాహార దీక్షకు కూర్చున్నారు. తీర్పును పునస్సమీక్షించాలనే డిమాండ్‌తో ఆయన దీక్ష చేశారు. రాజకీయంగా ప్రత్యర్థులే అయినా.. ఆయన దీక్షకు కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యమంత్రి కూడా మద్దతు ఇవ్వడం ఒక విశేషం.

ఇలాంటి విలక్షణమైన రాజకీయాలు నడుస్తున్న సమయంలో.. అన్ని వివాదాలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ.. సుప్రీం న్యాయస్థానం మంగళవారం తీర్పు ఇచ్చింది. తొలుత మంగళవారం మధ్యాహ్నం లోగా.. నీటి విడుదల విషయంలో మీ వైఖరి తేల్చిచెప్పాలంటూ సుప్రీం కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. మధ్యాహ్నం తర్వాత 7 నుంచి 18వ తేదీ వరకు నీటిని విడుదల చేసి తీరాల్సిందేనని సుప్రీం తీర్పు ఇచ్చింది.

Similar News