ఒకవైపు 2019 ఎన్నికల నాటికి తాము స్వతంత్రంగా అధికారంలోకి రాగల స్థాయి పార్టీగా ఎదుగుతాం అంటూ ఆంధ్రప్రదేశ్ లో సవాళ్లు విసురుతూ సమావేశాలు నిర్వహించే భారతీయ జనతా పార్టీకి ఇప్పుడిప్పుడే కొన్ని చికాకులు ఎదురవుతున్నాయి. నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలంటూ.. విజయవాడకు చెందిన నగర పార్టీ అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరాజు ఆందోళన చేయడంతో.. పార్టీ ఆయన మీద సస్పెన్షన్ వేటు వేసింది. నామినేటెడ్ పదవులు అడగడం కూడా తప్పేనా అంటూ పార్టీలో ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది.
భారతీయ జనతా పార్టీ అంటే అంతా క్రమశిక్షణకు మారుపేరులాగా చెప్పుకుంటారు. అయితే పార్టీకి అధికారం లేనప్పుడు వారిలో క్రమశిక్షణ గాఢంగానే వెల్లి విరుస్తూ వచ్చింది. అసలు క్రమశిక్షణ ఏమిటో ఇప్పుడు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నట్లుంది. ఎందుకంటే.. రెండున్నరేళ్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి నామినేటెడ్ పదవులు ఆశిస్తూ ఉన్న రాష్ట్ర భాజపా నాయకుల్లో ఇప్పుడు అసహనం పెరుగుతోంది. కేంద్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి నామినేటెడ్ పదవులు ఇవ్వడం గురించి స్థానిక నాయకులు చాలా మందికి రకరకాల హామీలు లభిస్తున్నాయి. అన్నీ హామీలే తప్ప.. నిర్దిష్టంగా ఒక్కరికీ పని జరిగింది లేదు.
ఇలాంటి నేపథ్యంలో విజయవాడ నగర పార్టీ అధ్యక్షుడు దాసం ఉమామహేశ్వరరాజు.. పదవి కోసం ఆందోళన చేశారు. ఇలాంటి ఆందోళనలు పార్టీ క్రమశిక్షణకు విరుద్ధం అంటూ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఆయనను పార్టీనుంచి సస్పెండ్ చేశారు. దీనిపై రాజు అనుచరులంతా విజయవాడలో ఆందోళనలు వ్యక్తం చేయడం విశేషం. తన సస్పెన్షన్ పై ప్రత్యేకంగా ప్రెస్ మీట్ కూడా పెట్టిన రాజు... పదవులు అడగడం కూడా తప్పేనా అంటూ ప్రశ్నించారు. కంభంపాటి హరిబాబు షోకాజు కూడా ఇవ్వకుండా, విచారణ జరపకుండా ఏకపక్షంగా తనను సస్పెండ్ చేశారంటూ ఆరోపించారు.
హోదా విషయంలో రాష్ట్రప్రజలకు చేసిన వంచన ఏపీ భాజపాను ఒకరకంగా దెబ్బతీస్తుందని అంతా అనుకుంటూ ఉంటే.. ఇప్పుడు ఇలాంటి అసంత్రుప్తులు , తిరుగుబాట్లు మరో రకంగా కూడా పార్టీకి చేటు చేసేలా ఉన్నాయి.