పురట్చి తలైవి జయలలిత ఆస్పత్రిలో తీవ్రమైన అనారోగ్య పరిస్థితిలో ఉన్నారు. ఆమె ఆరోగ్యం గురించి రాష్ట్రవ్యాప్తంగా అనేక భయాలు, సందేహాలు చెలామణీ
అవుతున్నాయి. ప్రజలు ఆమెకోసం ఏడుస్తూ, పూజలు చేస్తూ గడుపుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు జరిగినా ఫలితం
ఎలా ఉంటుంది. ఖచ్చితంగా అమ్మ పార్టీ అన్నా డీఎంకే కే ఏకపక్షంగా ఉండే ఫలితాలు వస్తాయి. అందుకే రాజకీయ ప్రత్యర్థి డీఎంకే న్యాయస్థానాన్ని
ఆశ్రయించింది. ఈ నెల మూడో వారంలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని కోరింది. కోర్టు కూడా ఇందుకు అనుకూలంగా
స్పందించడం విశేషం.
ఈనెల 17, 19 తేదీల్లో తమిళనాడులో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్నప్పటికీ, ఈ స్థానిక ఎన్నికల్లో తమ సత్తా
చాటుకోవాలని విపక్షం డీఎంకే ఆరాటపడుతోంది. ఇలాంటి నేపథ్యంలో జయలలిత ఆరోగ్య సమస్యతో ఆస్పత్రి పాలు కావడం జరిగింది. అయితే ఆమె ఆరోగ్యం
గురించి వీడియోలను విడుదల చేయాలంటూ డీఎంకే తొలిరోజునుంచి బలంగా డిమాండ్ చేస్తూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ డిమాండును రామస్వామి
అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేయడం ద్వారా సాధించారు.
తాజాగా స్థానిక ఎన్నికల మీద డీఎంకే ద్రుష్టి పెట్టింది. ఈ నెలలో ఆ ఎన్నికలు గనుక జరిగితే.. అన్నా డీఎంకే మొత్తం క్లీన్ స్వీప్ చేయడంలో సందేహం లేదు.
అందుకే పిటిషన్ వేయడంతో.. కోర్టు వాటిని వాయిదా వేసింది. డిసెంబరు 30 వ తేదీలోగా నిర్వహించుకోవచ్చునని తెలియజేసింది. ఇంతకూ ఆస్పత్రిలో ఉన్న
పురట్చి తలైవి ఆరోగ్యం గురించి మాత్రం పూర్తి క్లారిటీ రావడం లేదు.