తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నదో వాస్తవాలను ఫోటోలు సహా అపోలో ఆస్పత్రి వారు తెలియజేయాలని, ఆమె గురించి ఆందోళన చెందుతున్న లక్షలాది మంది ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో రామస్వామి వేసిన పిటిషన్ లో తీర్పు వచ్చింది. ఈ విషయంలో రామస్వామి కోరినట్లుగా జయలలిత ఆరోగ్యం గురించి తెలియజేయాల్సిన అవసరం ఉన్నదంటూ అపోలో ఆస్పత్రిని హైకోర్టు ఆదేశించింది.
తక్షణం అమ్మ ఆరోగ్యం గురించి పూర్తి రహస్యాలు వెల్లడించాలని కోర్టు ఉత్తర్వులు చెబుతున్నాయి. జయలలితను కేవలం లైఫ్ సేవింగ్ యూనిట్స్ మీద ఉంచారని కొన్ని పుకార్లు వస్తున్నాయి. నిజానికి ఆమె కళ్లు తెరిచారని, చికిత్సకు చక్కగా స్పందిస్తున్నారని కొన్ని వార్తలు కూడా మీడియాలో వచ్చాయి.
ఇలాంటి నేపథ్యంలో రోజువారీ అపోలో ఆస్పత్రి వారు ఒక బులెటిన్ ఇస్తున్నప్పటికీ.. అభిమానుల్లో సందేహాలు చాలా వరకు అలాగే ఉన్నాయి. వాటి నివృత్తి కోసమే అపోలో ఆస్పత్రి కావాలనే రహస్యం పాటిస్తున్నదని, ఆమె ఫోటోలు, వీడియోలు రాష్ట్ర ప్రజలకు చూపించడానికి అడ్డేమిటనికోర్టులో కేసు వేశారు. ఆ కేసులో మదరాసు హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది. తక్షణం రామస్వామి డిమాండ్ మేరకు జయలలిత ఆరోగ్యం వివరాలు తెలియజేయాలని ఆదేశించింది. సాయంత్రంలోగా.. జయలలిత తాజా పరిస్థితి గురించి ఫోటోలు, వీడియోలు కూడా వెల్లడి కావచ్చునని అంతా అనుకుంటున్నారు.