Srishti Fertility Center : నమ్రత మామూలు డాక్టర్ కాదు.. తవ్వేకొద్దీ షాకింగ్ నిజాలు
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసులో తవ్వేకొద్దీ అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల కేసులో తవ్వేకొద్దీ అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. చాలా మందిని మోసం చేసి అమాయకులనుంచి బిడ్డలను తీసుకుని సంతానం లేని వారికి అప్పగించిన ఈ కేసులో ఇప్పటికే డాక్టర్ నమ్రతతో పాటు అనేక మంది అరెస్ట్ అయ్యారు. తాజాగా హైదరాబాద్ పోలీసులు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరంతా విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులే కావడం విశేషం. ఈ కేసులో ఈ ముగ్గురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు విచారణలో గుర్తించి ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ప్రధాన పాత్ర పోషించిన డాక్టర్ నమ్రత కూడా విచారణలో అనేక విషయాలను వెల్లడించారని తెలిసింది.
బ్రోకర్లుగా మహిళలు...
ఈ కేసులో మధ్యవర్తులుగా వ్యవహరించిన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయ, సరోజ, రత్న అనే ముగ్గురు మహిళలు మధ్యవర్తిత్వం వహించి ఈ అక్రమాల్లో భాగస్వామ్యులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా వారి బ్యాంకు ఖాతాలను పరిశీలించి లావాదేవీలను కూడా తెలుసుకుని ఎంత మొత్తం చేతులు మారిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారి నుంచి లక్షల రూపాయలు తీసుకుని అమాయకుల నుంచి శిశువులను సేకరించడంతో పాటుగా వారికి కొంత మొత్తం ముట్టచెప్పి పెద్దయెత్తున అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది.
మాజీ ఎమ్మెల్యే సోదరుడు...
ఈ కేసులో మరొక కీలక పాత్రధారి మాజీ ఎమ్మెల్యే సోదరుడు కూడా ఉండటం విశేషం. వాసుపల్లి రవిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ాయన కేజీహెచ్ లో ఎనస్తీషియా విభాగ అధిపతిగా పనిచేస్తున్నారు. ఆయనతో పాటు విద్యుల్లతతో పాటు మరొక వైద్యురాలు ఉషాదేవిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరందరికీ డాక్టర్ నమ్రత భారీగానే డబ్బులు ముట్టజెప్పినట్లు తెలిసింది. విశాఖలో కేజీహెచ్ కు దగ్గరగానే ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఉండటంతో వీరంతా డ్యూటీలో ఉంటూనే అవసరమైన సమయంలో సృష్టికి వెళ్లి తమ సేవలందించడం పనిగా పెట్టుకున్నారు. వీరంతా ఒకే బ్యాచ్ కు చెందిన వారు కావడంతో నమ్రతకు వీరిని ఆకట్టుకోవడం సులువుగా మారింది.
గిరిజనులే లక్ష్యంగా...
అయితే గత కొంతకాలంగా వీరు నడుపుతున్న అక్రమ దందాకు కేజీహెచ్ వైద్యులు సహకరించడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎటువంటి బోర్డు లేకుండానే ఆసుపత్రిని నడపడటమే కాకుండా మధ్యవర్తుల ద్వారా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అన్న పేరుతో జనంలోకి వెళ్లి అమాయకులను నమ్మించి తీసుకు వచ్చి లక్షలు గుంజడం వీరికి వెన్నతో పెట్టిన విద్య అని చెబుతున్నారు. సరోగసి కోసం వచ్చిన వారికి వీర్యం, అండాలు సేకరించడంతో పాటు అద్దెగర్భం ఎవరన్నది తెలియకుండా జాగ్రత్తలు పడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. విశాఖ ఏజెన్సీలో అనేక మంది అమాయక గిరిజనులకు వల వేసి పట్టుకుని వారికి తృణమో ఫణమో ముట్టచెప్పి లక్షలు దండుకుంటూ దందా కొనసాగించడం వీరి నైజం. అయితే ఇప్పటి వరకూ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఎంత మందిని మోసం చేసిందన్న దానిపై పోలీసులు మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు.