విశాఖ సదస్సులో లక్షల కోట్ల పెట్టుబడులు.. అవగాహన ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ పట్నంలో నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు మంచి స్పందన లభించిం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ పట్నంలో నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు మంచి స్పందన లభించింది. విశాఖ వేదికగా భారీ ఎత్తున ఎంఓయూలను ప్రభుత్వం కుదుర్చుకుంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. మొత్తం రెండు రోజుల్లో 400 ఎంఓయూల ద్వారా రూ. 11,91,972 కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల రాష్ట్రంలో కొత్తగా 13,32,445 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతుంది. అంచనాలకు మించి ఎంఓయూలు కుదుర్చుకునేందుకు పరిశ్రమల ప్రతినిధులు తరలి రావడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మొత్తం నలభై దేశాల నుంచి 2,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
తొలిరోజు సదస్సులో...
తొలి రోజు భాగస్వామ్య సదస్సులో రూ. 8.26 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల అమలు ద్వారా 12.05 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో పాటు పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని అంచనాలు వేస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 41 ఎంఓయూల ద్వారా రూ. 3.50 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదర్చుకోనున్నారు. ఈ ఒప్పందాల ద్వారా 4.16 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక మంత్రుల సమక్షంలో 324 ఒప్పందాలు జరుగుతాయని, వాటి ద్వారా రూ. 8,41,786 కోట్ల పెట్టుబడులు రానున్నట్లు ప్రకటించాయి.
అనేక విభాగాలకు...
ఆంధ్రప్రదేశ్ లో సీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఐ అండ్ ఐ, పరిశ్రమలు - వాణిజ్యం, ఐటీి, మున్సిపల్ శాఖల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది..ఇన్నోవేటివ్ ప్రాజెక్టుల్లో సింగపూర్ కంపెనీలతో కలిసి పని చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమని ప్రకటించింది. ఏపీని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సింగపూర్ బృందంతో ఎంఓయూ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు.సీఎం చంద్రబాబు, సింగపూర్ హోం శాఖామంత్రి షణ్ముగం సమక్షంలో ఏపీ-సింగపూర్ మధ్య ఎంఓయూ కుదిరింది. అర్బన్ గవర్నెన్సు, రియల్ టైమ్, డిజిటల్ గవర్నెన్సు ట్రాన్సఫర్మేషన్, సుస్థిరాభివృద్ధి అంశాలపై అవగాహనా ఒప్పందం కుదిరింది. విజయవాడ- సింగపూర్ మధ్య విమాన సర్వీసు నడపాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు.