నోట్ల రద్దు నిర్ణయాన్ని ను వెనక్కు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఈ నిర్ణయాన్ని రద్దు చేసేయాలని కొన్ని విపక్షాలు యాగీ చేశాయి. అయినా ఇలాంటి విమర్శలను నరేంద్రమోదీ ఎంతమాత్రమూ పట్టించుకోలేదు. కాకపోతే న్యాయస్థానం నుంచి ఆదేశాలు వస్తే ఏంచేసి ఉండేవారు.? ఇది చిక్కు ప్రశ్నే. ఆ పరిస్థితి రాలేదు. నల్లధనం నియంత్రణకు అనే లక్ష్యంతో.. పెద్దనోట్లను రద్దుచేసి.. జనం ఇబ్బందులు పడుతున్నా వారికి సర్ది చెప్పుకుంటూ.. పరిస్థితిని గాడిలో పెట్టడానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వ ప్రయత్నాలకు విఘాతం లాగా.. కొందరు సుప్రీం న్యాయస్థానంలో నోట్ల రద్దు నిర్ణయం ఉపసంహరణను కోరుతూ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం నిలబడలేకపోయింది. నోట్ల రద్దు కు సంబంధించిన ప్రభుత్వ ఆదేశాలపై స్టే ఇవ్వడానికి సుప్రీం ధర్మాసనం నిరాకరించింది.
నిజానికి సుప్రీం తీర్పు ఊహించినదే అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పాత నోట్ల మార్పిడి విషయంలో ప్రజలకు తగినంత సమయం ఇవ్వలేదంటూ.. ప్రధానంగా అలాంటి ఆరోపణతో పిటిషనర్లు , ఏకంగా నోట్ల రద్దు నిర్ణయాన్నే ఉపసంహరించుకోవాలంటూ ప్రజాప్రయోజన వ్యాజ్యాల్ని దాఖలు చేశారు. ఢిల్లీకి చెందిన ముగ్గురు న్యాయవాదులు, లక్నోకు చెందిన ఓ న్యాయవాది ఈ పిటిషన్లు వేశారు. అయితే అన్నింటినీ కలిపి ఒకటేగా సుప్రీం ధర్మాసనం ఇవాళ విచారణకు స్వీకరించింది.
నిజానికి ప్రజలకు పాత నోట్ల మార్పిడికి తగినంత సమయం ఇవ్వలేదు అనే వాదన న్యాయస్థానం ముందు నిలబడలేకపోయింది. ఎందుకంటే.. 8వ తేదీ నాడు ప్రకటించిన గడువులకు ప్రస్తుతం పాత నోట్ల మార్పిడికి ఉన్న ఏర్పాట్లకు మధ్య చాలా తేడా ఉంది. ప్రజల కష్టాల గురించి కొత్త కొత్త సమస్యలు తమ దృష్టికి వస్తుండగా, వాటిని నివారించడానికి ఎక్కడికక్కడ ప్రభుత్వమూ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. అలాంటి నేపథ్యంలో పాతనోట్ల మార్పిడికి ఇప్పుడు సమంజసమైన గడువే ఉన్నది. పైగా నల్లధనం నియంత్రణ కోసం అనే సదుద్దేశంతో జరుగుతున్న ప్రయత్నం గనుక, ఈ దిశగా అసలు ప్రభుత్వం ఏం చేస్తున్నదంటూ గతంలోనూ సుప్రీం ధర్మాసనం పలుమార్లు ప్రశ్నించిది గనుక.. ఈ ప్రయత్నాన్ని అడ్డుకోకపోవచ్చునని అనుకున్నారు. దానికి తగినట్లే ఆదేశాలపై స్టే ఇవ్వడానికి సుప్రీం నిరాకరించడం విశేషం.
కాకపోతే.. ప్రజల కష్టాలు, అనూహ్యంగా ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో సుప్రీం ధర్మాసనం కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. బ్యాంకుల వద్ద క్యూలైన్లలోను, వెలుపల పెద్దనోట్లను ఖర్చు చేసే విషయంలోనూ సామాన్యులకు అనేక కష్టాలు ఎదురవుతున్నాయని వీటిని తీర్చడానికి ప్రభుత్వం దృష్టి సారించాలని సుప్రీం సూచించింది. దీనికి సంబంధించి అఫిడవిట్లు దాఖలు చేయాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది.