KCR : కేసీఆర్ మాటలపై నేతలకే నమ్మకం కలగడం లేదా?
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మళ్లీ యాక్టివ్ కానున్నారన్నది ఆ పార్టీ నేతలకే నమ్మకం కలగడం లేదు
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మళ్లీ యాక్టివ్ కానున్నారన్నది ఆ పార్టీ నేతలకే నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే పార్టీ ఆవిర్భావ సభలో వరంగల్ లో ఇక జనంలోనే ఉంటానని చెప్పిన కేసీఆర్ నిన్నటి వరకూ బయటకు రాలేదు. ఇప్పుడు మరోసారి వచ్చి ఇదిగో వస్తున్నానంటే నమ్మడానికి పార్టీ నేతలు కానీ, కార్యకర్తలు కాని మానసికంగా సిద్ధంగా లేరు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వరంగల్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో కూడా ఇలాగే ప్రకటన చేశారు. కానీ ఆవిర్భావ దినోత్సవాలు జరిగి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఫామ్ హౌస్ గడప దాటలేదు. వరంగల్ సభలో కూడా ఆవేశంగా ప్రకటించిన కేసీఆర్ తర్వాత అయితా పయితా లేరు. అదే విషయాన్ని ఇప్పుడు కార్యకర్తలు గుర్తుకు తెస్తున్నారు.
బహిరంగ సభలకు కూడా...
దాదాపు చాలా రోజుల తర్వాత తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్ పార్టీ నేతల సమావేశంలో ఆవేశంగా మాట్లాడారు. నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ఆదేశించారు. అయితే ఈ మూడు సభలకు కేసీఆర్ హాజరవుతారా? లేదా? అన్నది ఇప్పటికీ అందరికీ అనుమానమే. కానీ తాను వస్తానని చెప్పి అన్ని ఏర్పాట్లు చేయమంటారు. కానీ వచ్చేంత వరకూ నమ్మకం లేదన్నది బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఇక కేసీఆర్ బయటకు రాకపోతే అసలుకే ఎసరు తప్పదన్న భయం నేతల్లో ఇప్పటికే నెలకొని ఉంది. ఇప్పటికే అన్ని ఎన్నికల్లో ఓటమి పాలయిన బీఆర్ఎస్ ఇక కేసీఆర్ బయటకు రాకపోతే మరింత క్యాడర్ నీరుగారిపోతుందని తెలుసు.
కుమార్తె తలనొప్పి...
బీఆర్ఎస్ వర స ఓటములతో పాటు కుమార్తె కల్వకుంట్ల కవిత ఇప్పటికే యాత్ర పేరిట జనంలోకి వెళుతున్నారు. సామాజికయాత్ర పేరుతో తెలంగాణలో పర్యటిస్తూ పార్టీ నేతలపైనే విమర్శలు చేయడాన్ని కనీసం కేసీఆర్ ఖండించకపోవడం కూడా విమర్శలకు దారి తీస్తుంది. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయి రెండేళ్లు దాటుతున్నప్పటికీ పార్టీ అధినేత కేసీఆర్ కార్యకర్తలను కలిసేందుకు ఇష్టపడకపోవడం కూడా పార్టీపై ఎఫెక్ట్ పడనుందని చెబుతున్నారు. కేసీఆర్ ఫాం హౌస్ వదిలి జనంలోకి రావాలని క్యాడర్ కోరుకుంటున్నారు. కానీ కేసీఆర్ ను చూస్తుంటే ఇప్పట్లో కదిలేలా కనిపించడం లేదు. మరి కేసీఆర్ మీడియా సమావేశంలో చెప్పినట్లు బయటకు వస్తారా? రారా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది.