Jana Sena : గళం విప్పేదెన్నడు...? గ్రౌండ్ లెవెల్లో బలోపేతం అయ్యేదెప్పుడు?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చరిష్మాకు తిరుగులేదు

Update: 2025-12-22 07:07 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చరిష్మాకు తిరుగులేదు. ఆయనకు లక్షలాది మంది అభిమానులున్నారు. అదే ఆయన బలం.. బలగం. ఇక సామాజికవర్గం పరంగా కూడా ఆంధ్రప్రదేశ్ లో శాసించే స్థాయిలో ఉండటం పవన్ కల్యాణ్ కు కలసి వచ్చే అంశం. అయినా పవన్ కల్యాణ్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా, పార్టీని రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరించే దిశగా ప్రయత్నాలు మాత్రం చేయడం లేదన్నది వాస్తవం. రెండేళ్ల నుంచి పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఇన్నాళ్లూ తాను అధికారానికి కొత్త కావడంతో తనకు అప్పగించిన శాఖలపై అధ్యయనం చేయడానికేనని పవన్ కల్యాణ్ చెబుతున్నప్పటకీ ఆయన మాటలను క్యాడర్ నమ్మింది.

బలీయమైన శక్తిగా....
కానీ పవన్ కల్యాణ్ కు రాష్ట్రంలో బలీయమైన శక్తిగా, క్షేత్రస్థాయిలో పట్టున్న పార్టీగా జనసేనను తీర్చి దిద్దే ఉద్దేశ్యం మాత్రం కనిపించడం లేదు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి అని పవన్ ప్రశంసిచేవారున్నా ఆ డైలాగు సినిమాలకే సరిపోతుంది. బలముంటేనే కూటమిలో పై చేయి సాధించడానికి వీలవుతుంది. లేకుంటే జనసేన చేతులు కింద ఉండాల్సిందేనన్న వాస్తవ విషయాన్ని మాత్రం పవన్ కల్యాణ్ మర్చిపోతున్నారని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటి వరకూ చాలా నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జులు లేకపోవడం, బూత్ లెవెల్ కమిటీలు నియమించకపోవడంతో పాటు జిల్లాల వారీగా నేతలతో సమావేశం కాకపోవడం కూడా పవన్ రాజకీయాలను లైట్ గా తీసుకుంటున్నట్లు తెలిసింది.
ప్రస్తుత హోదాతోనే...
ప్రస్తుతం ఆంధ్రా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఆయన బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రస్తుత హోదాతోనే వంద శాతం సంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తున్నట్లే ఉది. పవన్ కల్యాణ్ తీరు చూస్తుంటే తనకు ఈ బాధ్యత చాలు అన్నట్లు ఉంది. ఇది ఆయన సింప్లిసిటీకి నిదర్శనం కావొచ్చు, కానీ 'సీఎం .. సీఎం' అని నినదించే పవన్ కల్యాణ్ అభిమానుల ఆశలపై నీళ్లు చల్లినట్లేనని కామెంట్స్ వినపడుతున్నాయి.బూత్ స్థాయి కమిటీలు, నియోజకవర్గ ఇన్చార్జిల వ్యవస్థ లేకపోతే ఎన్నికల్లో కోరినన్ని సీట్లు కూడా దక్కవన్న ఆందోళన జనసైనికుల్లో ఉంది. పార్టీ ఏర్పాటయి పదేళ్లు కావస్తున్నా పటిష్టమైన క్యాడర్ అంటూ లేకపోవడం ఖచ్చితంగా బలహీనమే.
ఓట్లగా మారాలంటే...
మరొకవైపు పవన్ కల్యాణ్ కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అవి ఓట్లగా మారతాయనుకుంటే పొరపాటే. గళం విప్పాలి. కాపు సామాజికవర్గం తానున్నానంటూ పవన్ గట్టి సంకేతాలను కూడా పంపగలగాలి. అప్పుడే సాలిడ్ ఓటు బ్యాంకు జనసేన సొంత మవుతుంది. మొన్నటి ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేటుతో విజయం సాధించడానికి యాభై శాతం పవన్ కల్యాణ్ క్రేజ్ అయితే. మరొక యాభై శాతం కూటమి పొత్తు వల్లనేనన్నది వాస్తవం. ఒంటరిగా ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయికి ఇంకా పార్టీ ఎదగాల్సి ఉంటుంది. పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ గానే ఉండదలచుకున్నట్లుంది. కింగ్ అవ్వాలన్న ఉద్దేశ్యం ఆయనలో కనిపించడం లేదన్న అభిప్రాయం జనసేన నేతల్లోనే వ్యక్తమవుతుంది. మరి పవన్ ఫ్యాన్స్ కోరిక తీర్చేలా మారతారా? లేదా? అన్నది చూడాలి.


Tags:    

Similar News