TDP : టీడీపీ నేతల్లో ఆనందం లేదెందుకంటే?

తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ ఎన్నికల హీట్ మొదలయింది.

Update: 2025-12-22 09:07 GMT

తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ ఎన్నికల హీట్ మొదలయింది. వచ్చే ఏడాది నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో వైసీపీకి చెందిన మూడు, టీడీపీకి చెందిన ఒక స్థానం ఖాళీ అవుతుంది. టీడీపీకి చెందిన సానా సతీష్ తో పాటు వైసీపికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో పాటు పరిమళ్ నత్వానీ పదవీ కాలం పూర్తి కావస్తుంది. అయితే ఇదే ఇప్పుడు టీడీపీ అధిష్టానినకి తలనొప్పిగా మారింది. టీడీపీకి చెందిన సానా సతీష్ కు మరోసారి రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. ఆయన పూర్తి కాలం పదవిలో లేకపోవడంతో మరొక అవకాశం ఇవ్వాలని ఇప్పటికే నాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఆ ఒక్కటీ మాత్రం సానా సతీష్ కు తిరిగి దక్కనుంది.

ఒకటి బీజేపీకి...
ఖాళీ అవుతున్న నాలుగు స్థానాల్లో ఖచ్చితంగా కూటమి గెలుచుకుంటుంది. అందుకే ఈ సారి ఈ పదవులకు పోటీ ఎక్కువగా ఉందని సమాచారం. ఇక మిగిలేది మూడు మాత్రమే. ఈ మూడింటిలో టీడీపీకి దక్కేది ఒక్కటేనని తెలుస్తోంది. ఎందుకంటే పరిమళ్ నత్వానీ స్థానంలో బీజేపీ నేత ఒకరిని పోటీకి దింపేందుకు ఇప్పటికే ఒప్పందం కుదిరినట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీ నేతకు ఈ అవకాశం ఇస్తారా? లేక జాతీయ స్థాయిలో మరొకరికి ఇస్తారా? అన్నది మత్రం తేలకపోయినా మూడింటిలో ఒక్కటి మాత్రం కమలం ఖాతాలో పడుతుంది. చంద్రబాబు నాయుడు కూడా ఇటీవల ఢిల్లీ పర్యటనలో వచ్చే ఏడాది ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానంలో మిత్రపక్షమైన బీజేపీకి ఇస్తామని చెప్పి వచ్చినట్లు కూడా హస్తిన నుంచి వినిపిస్తున్న టాక్.
మరొకటి జనసేనకు...
ఇక మరొకటి జనసేనకు ఖచ్చితంగా ఈ సారి రాజ్యసభ అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. జనసేనకు ఇప్పటి వరకూ రాజ్యసభలో అవకాశం కలగలేదు. అయితే ఖాళీ అవుతున్న నాలుగు స్థానాల్లో ఒకటి ఇస్తామని చంద్రబాబు పవన్ కల్యాణ్ కు ఎప్పుడో మాట ఇచ్చినట్లు అంటున్నారు. జనసేన నుంచి అభ్యర్థి ముందుగానే ఖరారయినట్లు తెలుస్తోంది. లింగమనేని రమేష్ ను జనసేన నుంచి పోటీ చేయించి రాజ్యసభకు పంపాలని నిర్ణయించారు. చంద్రబాబు కూడా ఇందుకు అంగీకరించడంతో అది జనసేన ఖాతాలో పడినట్లే మిగిలిన ఒక్క సీటు కోసం పార్టీలో తీవ్రమైన పోటీ ఉంది. అనేక మంది ఆశావహులున్నారు. అయితే చంద్రబాబు చివరికి ఎవరి పేరును నిర్ణయిస్తారన్నది మాత్రం ఉత్కంఠ రేపుతుంది.


Tags:    

Similar News