Kasu Mahesh Reddy : మహేశా.. మనసు మార్చుకున్నావటయ్యా?
గురజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి ఈ సారి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై వత్తిడి తీసుకు వస్తున్నట్లు తెలిసింది
గురజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి ఈ సారి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై వత్తిడి తీసుకు వస్తున్నట్లు తెలిసింది. 2019, 2024 ఎన్నికల్లో కాసు మహేష్ రెడ్డి గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2019లో గురజాల నుంచి గెలిచిన కాసు మహేష్ రెడ్డి 2024 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. ఇక గురజాల నియోజకవర్గం చరిత్ర చూస్తే 1983 నుంచి ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు, వైసీపీ ఒకసారి స్వతంత్ర అభ్యర్థి ఒకసారి, తెలుగుదేశం పార్టీ ఐదుసార్లు విజయం సాధించడం విశేషం. ఇక్కడ తెలుగుదేశంపార్టీ బలంగా ఉంది. బలమైన నేత యరపతినేని శ్రీనివాసరావు అక్కడ టీడీపీ నుంచి పోటీచేస్తూ వస్తున్నారు.
గురజాలలో టీడీపీ బలంగా...
994 నుంచి యరపతినేని శ్రీనివాసరావు వరసగా ఇప్పటికి టీడీపీ నుంచి ఐదు సార్లు గెలుపొందారు. జంగా కృష్ణమూర్తి రెండుసార్లు కాంగ్రెస్ నుంచి గెలిచారు. 2004 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జంగా కృష్ణమూర్తి ఇక్కడ దాదాపు 87 వేల ఓట్లను సాధించారు. 7,187 ఓట్లతోనే 2009 ఎన్నికల్లో యరపతినేని గెలుపొందడం విశేషం. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జంగా కృష్ణమూర్తిని ఎమ్మెల్సీగా చేసి ఆయన స్థానంలో కాసు కృష్ణారెడ్డి తనయుడు కాసు మహేష్ రెడ్డిని బరిలోకి దించారు. కాసు మహేష్ రెడ్డి గెలిచారు. కానీ గురజాల నుంచి కాసు కుటుంబానికి నరసరావుపేట మీదనే మక్కువ ఉంది. మనసు ఉంది. ఎందుకంటే కాసు కుటుంబం తొలి నుంచి నరసారావుపేట నుంచి పోటీ చేస్తూ గెలుస్తూనే ఉంది.
కాసు కుటుంబానికి బలమైన ...
కాసు మహేష్ రెడ్డికి బంధుత్వంతో పాటు ఆ కుటుంబానికి ఓటు బ్యాంకు కూడా నరసరావుపేటలో ఎక్కువగా ఉంది. 1967 లో కాసు బ్రహ్మానందరెడ్డి నరసరావుపేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత కాసు కృష్ణారెడ్డి 2009 వరకూ నరసరావుపేట నుంచి గెలుస్తూ వచ్చారు. అందుకే ఈసారి కాసు మహేష్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గురజాల కంటే తనకు నరసరావుపేట అయితే బెస్ట్ అని కాసు మహేష్ రెడ్డి భావిస్తున్నారని చెబుతున్నారు. అయితే ఇప్పటికే నరసరావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. 2014, 2019 ఎన్నికల్లో గోపిరెడ్డి నరసరావుపేట నుంచి గెలిచారు. కాసు మాత్రం తనకు పేట టిక్కెట్ ఇవ్వాలంటూ వైసీపీ అధినేత జగన్ కోరుతున్నట్లు తెలిసింది. మరి కాసు ప్రతిపాదనపై గన్ ఏ రకంగా స్పందిస్తారన్నది చూడాలి.