Weather Report : హిస్టరీని బ్రేక్ చేస్తున్న చలిగాలులు.. మరెన్నిరోజులంటే?

ఈ వచ్చేనెల మొదటి వారం వరకూ చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు

Update: 2025-12-22 03:52 GMT

చలిగాలులు చంపేస్తున్నాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల తీవ్రత కారణంగా మరింత ఎక్కువగా ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లోనూ చలి గాలులు ఎక్కువ స్థాయిలో వీస్తున్నాయి. చలి పంజా విసురుతుండటంతో అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకూ సాయంత్రం ఐదు గంటల తర్వాత రోడ్ల మీదకు రావాలంటే వణుకుతో అల్లాడిపోతున్నారు. మరికొన్ని రోజుల పాటు చలితీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వచ్చేనెల మొదటి వారం వరకూ చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలం వ్యాధులతో బాధపడే వారు, ఆస్మారోగులు బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.

పగలు, రాత్రి తేడా లేకుండా...
ఆంధ్రప్రదేశ్ లోనూ పగలు, రాత్రి తేడా లేకుండా చలి తీవ్రత చంపేస్తుంది. గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం వేళ పొగమంచు కూడా ఎక్కువగా కనిపిస్తుంది. వాహనదారులు ప్రయాణం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలను రాత్రి వేళ, పగలు ఎనిమిది గంటల వరకూ పక్కన నిలుపుకుని ఆ తర్వాతనే తమ ప్రయాణాలను కొనసాగిస్తున్నారు. దాదాపు రెండు వందల మీటర్ల వరకూ కనిపించని పరిస్థితి కనపడుుతుంది. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్లూరి సీతారామరాజు, పార్వతీ పురం మన్యం జిల్లాల్లో ఐదు డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
పదేళ్లలో ఇదే రికార్డు...
హిస్టరీ ని బ్రేక్ చేస్తున్నట్లుగా తెలంగాణలో చలిగాలులు తీవ్రత ఎక్కువగా ఉంది. పదేళ్లలో ఇదే రికార్డు అని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తెలంగాణాలోని దాదాపు అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు చలి తీవ్రత నుంచి కాపాడుకోవాలని, బయటకు వీలయినంత తక్కువగా రావడమే మంచిదని సూచిస్తున్నారు. సంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్, కొమ్రభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపింది.


Tags:    

Similar News