‘సచ్చుడో.. తెచ్చుడో’ సవాలును అంతా స్మరిస్తున్నారు

Update: 2016-11-29 09:25 GMT

‘‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ తెచ్చుడో..’’ తేలిపోవాల్సిందేనంటూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన రోజును యావత్తు తెలంగాణ ఇవాళ స్మరించుకుంటోంది. తెలంగాణ సాధనకోసం ఆమరణ నిరాహార దీక్షకు ఉద్యమించి 11 రోజుల పాటూ దీక్షలో ఉండడం ద్వారా ఢిల్లీ పాలకుల్లో కదలిక తీసుకువచ్చారు. తెలంగాణ సాధన దిశగా కేసీఆర్ దీక్ష అనేది ఓ ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోయింది. అందుకే కేసీఆర్ దీక్ష ప్రారంభించిన నవంబరు 29 వ తేదీని పార్టీ ఇవాళ దీక్షా దివస్ గా జరుపుకుంటోంది.

దీక్షాదివస్ పేరుతో రాష్ట్రమంతో రాష్ట్ర సాధన కోసం జరిగిన త్యాగాలను గుర్తు చేసుకునే ఉత్సవాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. మంగళవారం జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రముఖులంతా కేసీఆర్ దీక్షను పదేపదే ప్రస్తుతించారు. కేసీఆర్ దీక్ష చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందంటూ సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసిన వారినందరినీ స్మరించుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ సాధించాలనే దృఢ సంకల్పంతోనే దీక్ష సాగిందని, ఢిల్లీ పునాదులు కదిలేలా అహింసా మార్గంలో కేసీఆర్ దీక్ష చేశారని కొనియాడారు.

మంత్రి నాయని నరసింహారెడ్డి కూడా అదే స్థాయిలో కేసీఆర్ దీక్షను ప్రస్తుతించారు. ఆ సమయంలో తామంతా దీక్ష వద్దంటూ కేసీఆర్ ను నిలువరించడానికి ప్రయత్నించినట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రాణం తీయడానికి కూడా వెనుకాడదని అందుకే వద్దని చెప్పినట్లు నాయని అన్నారు. ‘తెలంగాణ ఇచ్చినందుకు సోనియాకు దండం.. అదే తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు గండం.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పనికిమాలినోళ్లు’ అంటూ నాయని విరుచుకుపడ్డారు.

అయతే ట్విస్టు ఏమిటంటే.. ఖమ్మం జిల్లాలో దీక్షా దివస్ కార్యక్రమం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఇటీవల కాంగ్రెస్ పార్టీనుంచి తెరాసలోకి ఫిరాయించిన అజయ్ కుమార్ నిర్వహించిన సమావేశంలో అంత రాసాభాసగా మారిపోయింది. కార్యకర్తలు పరస్పరం తగాదాలు పడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో సర్వం కోల్పోయామని , తమను పార్టీ, ఎమ్మెల్యేను ఆదుకోవాలని కార్యకర్తలు గందరగోళం సృష్టించారు. కేసీఆర్ దీక్షను స్మరించుకోవడానికి పెట్టుకున్న ఉత్సవంలో తమకు ఎదురైన నష్టాలను ఏకరవు పెడుతూ.. తమను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ కార్యకర్తలు గళమెత్తడంతో నాయకులు అయోమయంలో పడ్డారు.

Similar News