Ys Jagan : వైసీపీ ఇక అధికారంలోకి వచ్చినట్లేనా?
వైసీపీ అధినేత జగన్ లో రెండేళ్ల తర్వాత ధీమా పెరిగింది.
వైసీపీ అధినేత జగన్ లో రెండేళ్ల తర్వాత ధీమా పెరిగింది. ఈ సారి ఎన్నికల్లో విజయం తనదేనని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ఎవరేమనుకున్నా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. జగన్ లో గత కొద్ది రోజుల నుంచి కనపడుతున్న మార్పుతో పాటు విశ్వాసం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే ఆయన పదే పదే అందరీకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలీసు అధికారులకు వార్నింగ్ ఇవ్వడమంటే ఒకరకంగా పార్టీ క్యాడర్ లో ధైర్యం నింపేదుకు అనుకోవచ్చు. కానీ మెడికల్ కళాశాలలను ప్రయివేటుగా తీసుకున్న వారిని కూడా వదలిపెట్టనని, జైలుకు పంపుతానని చెబుతుండటం ఇప్పుడు పార్టీలోనే కాకుండా రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది.
గత ఎన్నికల్లనే నలభై శాతం...
గత ఎన్నికల్లోనే జగన్ కు నలభై శాతం ఓట్లు వచ్చాయి. అంటే ఐదేళ్లు పాలన చేసిన తర్వాత వచ్చిన ఓట్ల శాతం అది. అదే ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి, జైలుకు వెళ్లి సానుభూతిని పొంది, మూడు పార్టీలు కలిస్తే వచ్చింది అరవై శాతం మాత్రమే. అదే జగన్ కు గెలుస్తానన్న నమ్మకం. ప్రస్తుత ప్రభుత్వంపై ఖచ్చితంగా రెండేళ్లకు ముందే వ్యతిరేకత తీవ్రంగా వచ్చిందని, ఇటు కోస్తాంధ్ర ప్రాంతంలోనే కాకుండా ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోనూ స్పష్టమైన సంకేతాలు బలంగా తనకు కనిపించడం వల్లనే జగన్ పదే పదే ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. జగన్ నమ్మకంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం.
పాదయాత్ర చేస్తే...
ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి సహజంగా ఉండే వ్యతిరేకత ప్రతిపక్ష పార్టీకి సానుకూలంగా మారుతుంది. జగన్ కు అధికారంలో ఉన్నప్పుడే నలభై శాతం ఓట్లు వస్తే ప్రతిపక్షంలో ఉండి జనంలోకి వెళితే ఇక ఓటు శాతం పెరగడమే కాని తగ్గడమే ఉండదన్న అభిప్రాయం కూడా చాలా మందిలో వ్యక్తమవుతుంది. జగన్ ఎక్కడకు వెళ్లినా జనం విపరీతంగా వస్తున్నారు. అదే జగన్ ఖచ్చితంగా పాదయాత్ర చేస్తారంటున్నారు. అదే జరిగితే జగన్ గెలుపునకు మరింత దగ్గరవుతారని వైసీపీ నేతలు కూడా చెబుతున్నారు. అందుకే ఓటమి తర్వాత ఏడాదికి ఇప్పటికీ వైసీపీ నేతల్లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. వైసీపీ నేతలు కూడా ఇక తామే అధికారంలోకి వచ్చామని ఫీలవ్వడం కూడా అదే కారణం కావచ్చు.