Tirumala : శనివారం తిరుమలకు వెళుతున్నారా.. అయితే మీరు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది

Update: 2025-12-20 03:11 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శనివారం స్వామి వారిని దర్శించుకునేందుకు ఎక్కువ మంది భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. శనివారం తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. అందుకే శనివారం నాడు భక్తుల రద్డీ ఎక్కువగా ఉంటుంది. ఉండటానికి వసతి గదులు కూడా దొరకవు. అలాగే దర్శనానికి కూడా గంటల తరబడి వెయిట్ చేయాల్సి ఉంటుంది. అందుకే శనివారం నాడు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.

సెలవు దినాలు కావడంతో...
శనివారం తర్వాత ఆదివారం కూడా వస్తుండటంతో సెలవు దినం కావడంతో తిరుమలకు రావడానికి ఎక్కువ మంది భక్తులు ఇష్టపడతారు. ముందుగా మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు, రోజు వారీ ఎస్.ఎస్.డి. టోకెన్లు తీసుకుని కొండకు చేరుకునే వారు, శ్రీవాణి టిక్కెట్ల ద్వారా వచ్చే వారు, కాలినడకన వచ్చే భక్తులతో తిరుమలకు నిత్యం భక్తులు వస్తుంటారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అందులో భాగంగా శనివారం భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అంటారు.
హుండీ ఆదాయం మాత్రం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఎనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు స్వామి వారి దర్శనం పన్నెండు గంటలకు పైగానే సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,729 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో 22,162 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.31 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News