Pawan Kalyan : పవన్ కు బీజేపీ బిగ్ టాస్క్... అదేంటో తెలిస్తే?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తిన వైపు వెళ్లడం లేదు. ఆయన ఢిల్లీకి వెళ్లి చాలా రోజులవుతుంది
జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తిన వైపు వెళ్లడం లేదు. ఆయన ఢిల్లీకి వెళ్లి చాలా రోజులవుతుంది. బీజేపీ పెద్దలతో ఆయన టచ్ లో ఉన్నప్పటికీ ఆయన పెద్దగా ఢిల్లీకి వెళుతున్నట్లు కనిపించడం లేదు. మరొకవైపు జనసేనానితో బీజేపీ అగ్రస్థాయి నేతలు టచ్ లోనే ఉన్నారని తెలుస్తోంది. ఆయనను ఏ రకంగా ఉపయోగించుకోవాలన్న దానిపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఒక రోడ్ మ్యాప్ ను కూడా తయారు చేసిందని అనాలి. దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలనుకుంటున్న బీజేపీ పెద్దలకు పవన్ కల్యాణ్ ఒక ఆయుధంగా కనిపించారు. ముందుగా తమిళనాడులో పవన్ కల్యాణ్ సేవలను ఎక్కువగా వినియోగించుకోవాలని బీజేపీ కేంద్ర నాయకత్వం ఇప్పటికే డిసైడ్ అయింది.
తెలంగాణలోనూ బలోపేతం కావాలని...
జనసేన ఇప్పుడు తెలంగాణలోనూ బలోపేతం కావాలని పవన్ కల్యాణ్ భావిస్తుండటానికి వెనక కూడా బీజేపీ పెద్దల ఆలోచన ఉందని తెలుస్తోంది. ప్రధానంగా జనసేనను తెలంగాణలో బలోపేతం చేసినట్లయితే అందిన నిఘా నివేదికల ప్రకారం అవసరమైతే పొత్తు పెట్టుకోవచ్చు. లేకుంటే యువత, కొన్ని సామాజికవర్గం ఓట్లను చీలిస్తే ప్రత్యర్థి పార్టీలు నష్టపోతాయన్న అంచనా కావచ్చు. అందుకే ఎప్పుడూ లేనిది జనసేనాని తెలంగాణ జనసేన నాయకత్వంపై దృష్టి పెట్టడం కూడా అందులో భాగమేనని అంటున్నారు. నిజానికి టీడీపీ, వైసీపీ వంటి పార్టీలే తెలంగాణను వదిలేశాయి. కానీ పవన్ కల్యాణ్ తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టారంటే బీజేపీ వ్యూహంలో భాగమేనంటున్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో...
ఇక తమిళనాడు, కేరళ, కర్ణాటక ఎన్నికల్లోనూ పవన్ కల్యాణ్ ఒక తురుపు ముక్కగా బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తుంది. చూసేవారికి పవన్ కల్యాణ్ బీజేపీ నేతలతో పెద్దగా టచ్ గా లేరనిపిస్తుంది. కానీ ఆయన సనాతన ధర్మం, హిందూ ధర్మం వంటి నినాదాలు బీజేపీ నుంచి వచ్చినవేనని ఖచ్చితంగాచెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అని బీజేపీ నాయకత్వం కూడా గట్టిగా భావిస్తుంది. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉన్నంత వరకూ ఓకే. తర్వాత పవన్ కల్యాణ్ తో గేమ్ ఏపీలో నడిపించవచ్చన్న భావన కూడా ఉండిఉండవచ్చు అని అంటున్నారు. మొత్తం మీద పవన్ కల్యాణ్, బీజేపీ డైరెక్షన్ లోనే నడుస్తున్నారని స్పష్టంగా కనిపిస్తుంది.