India vs South Africa : ముందుగా భయపెట్టినా... దక్షిణాఫ్రికాపై భారత్ దే ఘన విజయం

అహ్మదాబాద్ లో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలిచింది.

Update: 2025-12-20 02:05 GMT

అహ్మదాబాద్ లో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలిచింది. దీంతో టీ 20 సిరీస్ 3–1తో టీ20 సిరీస్ ను భారత్‌ గెలుచుకుంది.చివరి మ్యాచ్‌లో భారత్ 30 పరుగుల తేడాతో గెలుపొందింది. బుమ్రా దెబ్బకు ప్రోటీస్‌ కుప్పకూలింది. శుక్రవారం జరిగిన చివరి టీ20లో భారత్‌ 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–1తో కైవసం చేసుకుంది. తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యాల అర్ధశతకాలు భారత్‌కు భారీ స్కోరు అందించాయి. సంజూశాంసన్ అద్భుతమైన రీ ఎంట్రీ ఇచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ ఎప్పటిలాగానే నిరాశపర్చాడు. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ముందు ఫీల్డింగ్ ఎంచుకుంది. అదే దానికి శాపంగా మారింది.

భారత్ దూకుడుగా బ్యాటింగ్...
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 231 పరుగులు చేసింది. సిరీస్‌లో రెండోసారి అర్ధశతకం సాధించిన తిలక్‌ వర్మ 42 బంతుల్లో 73 పరుగులు చేశాడు. హార్దిక్‌ పాండ్యా కేవలం 25 బంతుల్లో 63 పరుగులు చేసి స్టాండింగ్‌ ఓవేషన్‌ అందుకున్నాడు. వీరిద్దరూ కలిసి 7.2 ఓవర్లలో 105 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.ఓపెనర్లుగా వచ్చిన సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ దూకుడుగా ఆడారు. పవర్‌ప్లేలోనే 63 పరుగులు సాధించి, తొమ్మిది ఓవర్లకు స్కోరు 97కి తీసుకెళ్లారు. గాయంతో దూరమైన శుభ్‌మన్‌ గిల్‌ స్థానంలో ఆడిన శాంసన్‌ అక్టోబర్‌ తర్వాత తొలి టీ20లోనే ఆకట్టుకున్నాడు.
ఆరంభంలో బలంగా కనిపించినా...
లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఆరంభంలో బలంగా కనిపించింది. పవర్‌ప్లే ముగిసే సరికి వికెట్‌ కోల్పోకుండా 67 పరుగులు చేసింది. 10 ఓవర్లకు 118 పరుగులు చేసి ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యానికి సగం దూరం చేరింది. క్వింటన్‌ డికాక్‌ 35 బంతుల్లో 65, డీవాల్డ్‌ బ్రెవిస్‌ 17 బంతుల్లో 31 పరుగులు చేశారు. ఈ దశలో జస్ప్రిత్‌ బుమ్రా మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. యార్కర్‌తో డికాక్‌ను క్యాచ్‌ అండ్‌ బౌల్డ్‌గా అవుట్‌ చేసి కుప్పకూల్చడం ప్రారంభించాడు. నాలుగు ఓవర్లలో 17 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. వరుణ్‌ చక్రవర్తి ఒక ఓవర్‌లో 23 పరుగులు ఇచ్చినా, చివరికి 4 వికెట్లు తీసి భారత్‌ విజయంలో పాత్ర వహించాడు. దక్షిణాఫ్రికా 201 పరుగులకే పరిమితమై ఎనిమిది వికెట్లు కోల్పోయింది. దీంతో సిరీస్ భారత్ సొంతమయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా హార్ధిక్ పాండ్యా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా వరుణ్ చక్రవర్తి ఎంపికయ్యారు.


Tags:    

Similar News