Chandrababu : చంద్రబాబు కష్టానికి ఫలితం లేకపోవడానికి కారణమదేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన విషయంలో రాజీ పడరు.

Update: 2025-12-19 07:05 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన విషయంలో రాజీ పడరు. 1995 నుంచి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన నాటి నుంచి ఆయన తనకు తాను రాష్ట్రానికి సీఈవోగా చెప్పుకున్నారు. ఇప్పుడు కూడా 1995లో ఎంత ఎనర్జీలో రోజుకు గంటల పాటు శ్రమిస్తున్నారో ఇప్పుడు కూడా అంతే. నిజంగా ఆయన ఎనర్జీకి హ్యాట్సాఫ్. మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే చంద్రబాబు నిరంతరం రాజకీయాలు, రాష్ట్రాభివృద్ధి వంటి వాటిపైనే ఎక్కువ దృష్టిపెడతారు. ఫ్యామిలీకి కేటాయించే సమయం తక్కువ. 2024 లో దాదాపు 96 శాతం స్ట్రయిక్ రేట్ తో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

ఎంతగా శ్రమిస్తున్నా...
అప్పటి నుంచి ఆయన నిరంతరం రాష్ట్రాభివృద్ధి కోసం శ్రమిస్తూనే ఉన్నారు. రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొని అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో ఈరోజు కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్‌, నితిన్‌ గడ్కరీ, సీఆర్‌ పాటిల్‌, హర్దీప్‌ సింగ్‌ పూరి, సర్బానంద సోనోవాల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీకానున్నారు. పలు రాష్ట్ర అంశాలపై కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. ఇంత ఓపిక, అంత ఎనర్జీ ఆయనకు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ యువ ముఖ్యమంత్రులు కూడా ఆ రకంగా పరుగెత్తలేరన్నది వాస్తవం. అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండూ బ్యాలెన్స్ చేస్తూ పాలన చేస్తున్నారు. ప్రతి నెల పింఛను మొత్తం చెల్లించడానికి గ్రామాలకు స్వయంగా వెళుతున్నారు.
పాజిటివిటీ లేకపోవడానికి...
అయితే చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో రావాల్సిన పాజిటివిటీ రావడం లేదు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు కలెక్టర్ల సమావేశంలో స్వయంగా అంగీకరించారు. అయితే తగినంతగా ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పటికీ విపక్షాల విమర్శలే హైలెట్ అవుతున్నాయి. గత పద్దెనిమిది నెలల కాలంలో టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా పెద్దగా యాక్టివ్ గా లేకపోవడమూ ఇందుకు కారణం కావచ్చు. గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో క్రమశిక్షణ కనిపించేది. కానీ నేడు లోపించిందన్నది సీనియర్ నేతలే అంగీకరిస్తున్నారు. పార్టీ పట్ల అంకిత భావం కూడా క్రమంగా తగ్గుతుందని సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తరహాలోనే ఇతర నేతలు కూడా కష్టపడితేనే 2029 ఎన్నికల్లో విజయం సాధ్యమవుతుంది. లేకుంటే రాజకీయంగా ఇబ్బందులు తప్పవు.


Tags:    

Similar News

.