Cold Waves : వచ్చే మూడు రోజులు కీలకమే.. గడ్డ కట్టే చలి ఉంటుందట.. అలెర్ట్

వచ్చే మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది

Update: 2025-12-20 04:06 GMT

వచ్చే మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. వచ్చే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్, యానాంలలో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజులు తీవ్రమైన చలిగాలులు వీచే అవకాశముందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో పాఠశాలల వేళల్లోనూ మార్పులు చేసిందంటే చలి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు...
రాయలసీమ, ఉత్తర, దక్షిణ కోస్తా, యానాంలో గురువారం, శుక్రవారం, శనివారం పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. రాగల ఐదు రోజుల్లో రాయలసీమలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి లేదా రెండు చోట్ల సాధారణము కంటే 2 నుంచి మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. ఇక రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీల నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు, రేపు చలిగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
విద్యుత్తు వినియోగం తగ్గి...
తెలంగాణలోనూ చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ప్రజలు ఫ్యాన్ లు వేసుకోవడం కూడా మర్చిపోయారు. గత నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. నవంబరు నెల రెండో వారం నుంచి ఇప్పటి వరకూ విద్యుత్తు వినియోగం కూడా గణనీయంగా తగ్గింది.వచ్చే వారం చలితీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు పదిహేను జిల్లాల్లో పది డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ప్రధానంగా హైదరాబాద్, హనుమకొండ, ఆదిలాబాద్, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరొకవైపు దట్టమైన పొగమంచు ఇబ్బందులు పెడుతుంది.


Tags:    

Similar News

.