వెంకయ్య రంగంలోకి దిగాక వారి కోరిక తీరుతుందేమో!

Update: 2016-11-29 03:35 GMT

మన దేశంలో ఎస్సీవర్గీకరణ అనేది సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్య. ఎస్సీల్లో మాల- మాదిగల విషయంలో సర్కారు కల్పించే ప్రయోజనాలు సమస్తం ఒక వర్గం వారికి మాత్రమే పరిమితం అవుతున్నాయని, ఎస్సీల్లో వర్గీకరణ జరిగితే తమ సమన్యాయం ఉండదనే డిమాండ్లు సుదీర్ఘ కాలంగా ఉన్నాయి. వీటికి గతంలోనే కొన్ని అనుకూల నిర్ణయాలు వచ్చినప్పటికీ.. న్యాయపరమైన చిక్కుల కారణంగా ఆగిపోయాయి. ఇప్పుడు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్వయంగా ఈ మాదిగల అనుకూల పోరాటంలో జోక్యం చేసుకుంటున్నారు. మొన్న జరిగిన మాదిగల సభలో తాను స్వయంగా పాల్గొనడం మాత్రమే కాదు.. వర్గీకరణలో ఉన్న న్యాయమైన డిమాండును ఆయన ప్రధాని నరేంద్రమోదీ దృష్టికి తీసుకువెళ్లినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఎస్సీ వర్గీకరణ అనేది సుదీర్ఘ కాలంగా ఉన్న డిమాండు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే.. మాల సామాజిక వర్గంనుంచి కాస్త ప్రతిఘటన ఉన్నప్పటికీ.. వర్గీకరణను చేపట్టారు. ఎస్సీలను ఏబీసీడీ లుగా వర్గీకరించారు. అయితే తర్వాత న్యాయపరమైన చిక్కుల్లో అది ఆగిపోయింది. మళ్లీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మందక్రిష్ణ మాదిగ ఈ డిమాండ్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు గానీ కార్యం నెరవేరలేదు. అన్ని పార్టీల నాయకులనూ ఆయన కలిసి మద్దతు కూడగట్టినా ఫలితం మాత్రం జరగలేదు. తాజాగా హైదరాబాదులో నిర్వహించిన మాదిగ దండోరా కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్వయంగా పాల్గొన్నారు. వర్గీకరణకు భాజపా కట్టుబడి ఉంటుందని ఆయన సభాముఖంగా హామీ ఇచ్చారు.

అయితే వెంకయ్యనాయుడు దీనిని చాలామంది నేతల రాజకీయ హామీ ల లాగా ఆ సభలోనే వదిలేసి వెళ్లిపోలేదు. ఢిల్లీ వెళ్లగానే మళ్లీ మోదీ వద్దకు వెళ్లి ఇదే అంశాన్ని ప్రస్తావించి, ఎస్సీల వర్గీకరణ జరగాల్సిన ఆవశ్యకతను ఆయనకు వివరించినట్లుగా తెలుస్తోంది.

మోదీ సానుకూలంగా స్పందించి ఎస్సీ వర్గీకరణ వ్యవహారం ఒక కొలక్కి వస్తే గనుక.. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సామాజిక సమస్యకు పరిష్కారం లభించినట్లే. ఈ నిర్ణయం జరిగితే రాజకీయంగా కూడా భాజపాకు మంచి మైలేజీ అవుతుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు.

Similar News