రఘువీరా చాలా మంచి పాయింటు లేవనెత్తారు

Update: 2016-10-30 06:39 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో విశ్వసనీయత పోబట్టి.. వారి మాటలు జనం నమ్మడం లేదు గానీ... తాజాగా పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ఓ మంచి పాయింటు లేవనెత్తారు. జనం దీన్ని విశ్వాసంలోకి తీసుకుంటే గనుక... ఖచ్చితంగా చంద్రబాబునాయుడు సర్కారు జవాబుదారీతనం వహించాల్సిందే. రఘువీరా మాటల్ని ప్రజలు నమ్మితే, ఆ సందేహాన్ని నివృత్తి చేయడానికి చంద్రబాబు తన వంతు ప్రయత్నం చేయాల్సిందే.

కేంద్రప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే అయిదేళ్లలో 2.03 లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇవ్వబోతున్నట్లు అరుణ్ జైట్లీ సభలో ప్రకటించారు. అయితే రఘువీరారెడ్డి లేవనెత్తుతున్న లాజిక్ ఏంటంటే.. 14వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రెగ్యులర్ కేటాయింపుల్లో వచ్చే సొమ్ములే తప్ప.. అదనంగా ఏమీ కేంద్రం ఇవ్వడం లేదు కదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరోవైపు బీహార్‌కు 4 లక్షల కోట్లు, ఉత్తరప్రదేశ్ కు 7.05 లక్షల కోట్లు కేంద్రం ఇస్తోంది కదా! అంతకు మించి వారు ఏపీ సర్కారు కోసం ప్రత్యేకంగా చేస్తున్నది ఏముంది అని రఘువీరా ప్రశ్నస్తున్నారు.

రఘువీరా ఈ సందేహం లేవనెత్తిన తర్వాత.. చంద్రబాబునాయుడు దీన్ని నివృత్తి చేయాల్సి ఉంది. కేంద్రం మనకు ఏమైనా ప్రత్యేకంగా కొంత సొమ్ము అయినా ఇస్తున్నదా.. లేదా, సాధారణంగా 14వ ఆర్థిక సంఘం ద్వారా రాగల నిధులను మాత్రమే విదిల్చి ఊరుకుంటుందా? అనేది సర్కారు చెప్పాలి. అదే నిజమైతే మన రాష్ట్రం ఎంతగా వంచనకు గురవుతున్నదో ప్రజలు తెలుసుకోవాలి. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ గురించి ఊరూరా సభలు పెడుతూ.. మేం అద్భుతంగా ఇచ్చేశాం అని చెప్పుకుంటున్న వెంకయ్యనాయుడైనా సరే.. రఘువీరా లేవనెత్తిన ఈ సందేహాలకు డొంకతిరుగుడు లేకుండా సూటిగా జవాబు చెబితే.. జనం నమ్ముతారు.

Similar News