Bus Accident : కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం.. పదిహేడు మంది మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదంలో పదిహేడు మందికిపైగా మరణించారు
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదంలో పదిహేడు మందికిపైగా మరణించారు. మృతు సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. కర్ణాటకలోని చిత్రదుర్గ లో ఈ ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళుతున్న సీబర్డ్ ప్రయివేటు ట్రావెల్స్ బస్సును కంటెయినర్ లారీ ఢీకొనడంతోఈ బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదమూడు మంది వరకూ ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. చిత్రదుర్గ జిల్లాలోని జాతీయ రహదారి 48పై ఈరోజు తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన సమయంలో...
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 36 మంది వరకూ ప్రయాణికులున్నట్లు ప్రాధమికంగా గుర్తించారు. చిత్రదుర్గ, తుమకూరు జిల్లాల అధికారుల హుటాహుటిన అక్కడకు చేరుకని సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రమాదానికి అతివేగంతో పాటు పొగమంచు కూడా ఒక కారణమని ప్రాధమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత బస్సు డ్రైవర్లు ఇద్దరూ తప్పించుకుని పరారయ్యారు. ప్రయాణికులు కొందరు బస్సు అద్దాలు పగలకొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు.
క్షణాల్లో మంటలు అంటుకోవడంతో...
ప్రమాదం జరిగిన వెంటనే క్షణాల్లో బస్సును మంటలు అంటుకున్నాయి. దీంతో నిద్రలో ఉన్న ప్రయాణికులు తప్పించుకోలేకపోయారు. అయితే ఈ ప్రమాదంలో పదమూడు మందికి పైగానే మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. బస్సు పూర్తిగా కాలి బూడిదయింది. గాయపడిన వారిని సిరా, హిరాయూరు ఆసుపత్రులకు తరలించారు. అయితే మరణించిన వారు ఎక్కడి వారన్నది ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారిపై పూర్తిగా ట్రాఫిక్ స్థంభించిపోయింది. ఇటీవల తరచూ ప్రయివేటు బస్సులు ప్రమాదాలకు గురి కావడం ఆందోళనకు గురి చేస్తుంది. ప్రయాణమంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.