Kadapa : కడపలో ఈ మార్పు మంచికేనా? నాయకత్వం సీరియస్ అయింది అందుకేనా?

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిని పార్టీ నాయకత్వం ఈసారి పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి

Update: 2025-12-25 07:05 GMT

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిని పార్టీ నాయకత్వం ఈసారి పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తరచూ వివాదాలు చిక్కుకుంటుండటంతో ఇటీవల మాధవిరెడ్డి భర్త రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డిని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పక్కకు తప్పించడంతో పాటు మాధవి రెడ్డిపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందంటూ పార్టీ నాయకత్వానికి నివేదికలు అందాయి. అందుకే శ్రీనివాసులురెడ్డిని పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో భూపేశ్ రెడ్డిని నియమించారంటున్నారు. మాధవి రెడ్డి తొలిసారి ఎమ్మెల్యేగా అందులోనూ కడపలో గెలవడంతో అందరూ ఆమెను అభినందించారు. నిజంగా ఇది కూటమి ప్రభుత్వానికి ప్లస్ మాత్రమే కాకుండా వైసీపీకి షాక్ అని చెప్పాలి. అలాంటి చోట మాధవి రెడ్డితో పాటు ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి అనుసరిస్తున్న తీరు పార్టీ నాయకత్వానికి ఇబ్బందిగా మారింది.

పార్టీ నేతలను కూడా...
చివరకు పార్టీ నేతలను కూడా వారు పట్టించుకోవడం మానేశారు. కడపలో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేసిన వారిని కాదని తమకంటూ సొంత గ్రూపును సిద్ధం చేసుకునే ప్రయత్నంలో అనేక పొరపాట్లు చేశారని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు. ఒకదశలో కడప పట్టణంలో ఉండే టీడీపీ నేతలు తమ గోడును వినిపించుకోవడానికి కమలాపురం టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డిని ఆశ్రయించారంటే ఏ స్థాయిలో రెడ్డప్పగారి కుటుంబం ఇబ్బందులు పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. మేయర్ సురేష్ బాబును పదవి నుంచి తొలగించడంపై పెద్దగా నాయకత్వం అభ్యంతరం తెలపలేదు కానీ, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికే అధిక ప్రాధాన్యత ఇస్తుండటమే స్థానిక నేతల ఆగ్రహానికి కారణమయిందంటున్నారు.
తమకు తిరుగులేదని...
మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కడప జిల్లాల్లో పదింటిలో ఏడు స్థానాలను కూటమి గెలుచుకుంది. అందుకే అక్కడ మహానాడును కూడా టీడీపీ నిర్వహించింది. అయితే ఈ దంపతుల దెబ్బకు పార్టీ కుదేలవుతుందని భావించి రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డిని జిల్లా అధ్యక్ష పదవి నుంచి తప్పించారంటున్నారు. దీంతో టీడీపీలోని ఆయన వ్యతిరేకులు పండగ చేసుకుంటున్నారు. శ్రీనివాసులు రెడ్డి స్థానంలో జమ్మలమడుగు నేత భూపేష్ రెడ్డికి పార్టీ బాధ్యతలను అప్పగించింది. ఎవరినీ లెక్క చేయకపోవడం, కడప జిల్లాలో తమకు తిరుగులేదని భావించడమే ఈ మార్పునకు కారణమని అంటున్నారు. అయితే పార్టీ కష్టకాలంలో శ్రమించి, అన్ని ఒత్తిళ్లు ఎదుర్కొన్న తమను ఇలా దూరం పెట్టడంపై రెడ్డప్పగారి అనుచరులు గుర్రుమంటున్నారట. కానీ రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డిని పొలిట్ బ్యూరోలో తీసుకోవడంతో కొంత ఊరట కలిగించే అంశం.


Tags:    

Similar News