ఆమెకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేయడానికి వెళ్లిన సందర్భంలో కూడా , ఆమె గురించి మోదీ, తన ‘దీదీ’ అంటూనే ఎన్నికల ప్రసంగాల్లో వ్యవహరించారు. ఆ రకంగా ఇప్పటిదాకా ఆమెను ప్రసన్నంగా ఉంచుకునే పనులు మాత్రమే చేశారు. కానీ.. ఆమె మాత్రం మోదీ పట్ల అంత సానుభూతితో గానీ, సానుకూల దృక్పథంతోగానీ ఉన్నట్లుగా కనిపించడం లేదు. మొత్తానికి మోదీకి చుక్కలు చూపించడానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కంకణం కట్టుకున్నారు. మోదీ నోట్ల రద్దు అంశాన్ని తానుగా వ్యతిరేకించడం మాత్రమే కాదు.. దానిపట్ల అందరిలోనూ వ్యతిరేక భావనను తానే మొదలుపెట్టి.. మోదీని చికాకు పెట్టడానికి ఆమె కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.
మోదీ సర్కారు మీద యుద్ధం ప్రకటించడానికి నోట్ల రద్దు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు అనేవి ఒక మంచి అవకాశంగా విపక్షాలు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. వామపక్షాలు, కేజ్రీవాల్, లాలూ, మమతా, కాంగ్రెస్ తదితరులంతా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వ్యతిరేకిస్తున్న వారినందరినీ ఒక తాటిపైకి తెచ్చి.. ప్రభుత్వాన్ని పార్లమెంటులో చికాకు పెట్టాలనేది మమతాదీదీ ప్రణాళికగా ఉంది.
ఆమె నిజానికి తన రాష్ట్రం పరిధిని మించి.. ఢిల్లీ రాజకీయాల మీద దృష్టి సారించడానికి ఈ అంశాన్ని వాడుకుంటున్నట్లుగా ఉంది. ఎన్డీయేతర పార్టీలు అన్నిటితో తానే స్వయంగా మాట్లాడి వారి మద్దతు కూడగడుతున్న మమతా బెనర్జీ తాను స్వయంగా ఢిల్లీ వెళ్లి, అక్కడ విపక్షాలకు చెందిన వంద మంది ఎమ్మెల్యేలతో పార్లమెంటు వరకు పాదయాత్ర నిర్వహించి.. వ్యవహారాన్ని రచ్చకీడ్చాలని అనుకుంటోంది. మొత్తానికి నోట్ల రద్దు వ్యవహారంలో ఎంత రగడ వీలైతే అంతరగడ చేయడానికి మమతా కంకణం కట్టుకున్నదని పరిశీలకులు భావిస్తున్నారు.