జనానికి కష్టాలు కలగకుండా మోదీ సర్కారు చాలా ఉపశమన చర్యలు తీసుకున్నది. రకరకాల ఏర్పాట్లు చేశారు. పాతనోట్ల చెల్లుబాటు గడువును తొలుత మూడురోజులు మాత్రమే.. 11వ తేదీ వరకే అనుకున్నది కాస్తా.. 24వ తేదీ వరకు అనుమతిస్తున్నారు. ఇంకా ప్రజల వద్దనుంచి పాతనోట్లను ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా 24వ తేదీ వరకు ఆమోదించాల్సిందే అని మోదీ సర్కారు చాలా స్పష్టంగా పేర్కొన్నది. అయితే కొన్ని సంస్థలు మాత్రం ఈ ఆదేశాల్ని యథేచ్ఛగా ధిక్కరిస్తున్నాయి. పాతనోట్లతో వెళుతున్న ప్రజలను ఉత్తి చేతులతో తిప్పి పంపుతున్నాయి.
- అన్నదాతలకు ఈ ఇబ్బంది చాలా ఎక్కువగా ఎదరవుతోంది. మార్కెట్ యార్డులు ప్రభుత్వ రంగంలోని సంస్థలే అయినప్పటికీ.. యార్డుల్లో రైతులు ఇస్తున్న రద్దయిన పెద్ద నోట్లను స్వీకరించడంలేదని వార్తలు వస్తున్నాయి. దీంతో రైతులు చాలా అవస్థలకు గురవుతున్నారు.
- అదే విధంగా జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) కూడా తమ సంస్థకు వినియోగదారులు, పాలసీ దారులు చేయాల్సిన చెల్లింపులు వేటినీ రద్దయిన నోట్ల రూపంలో స్వీకరించడం లేదు. కనీసం బీమా పాలసీల ప్రీమియం మొత్తాలు తీసుకోవడానికి కూడా రద్దయిన నోట్లను ఆమోదించకపోవడంతో వినియోగదారులకు చాలా కష్టాలు ఎదురవుతున్నాయి.
ఈ విషయంలో ఎల్ఐసీ ఉన్నతాధికారులు ఇంకా పాలసీ డెసిషన్ తీసుకోవాల్సి ఉందని అప్పటిదాకా నోట్లు తీసుకోం అని బీమా కార్యాలయాల సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వ రంగంలోని సంస్థ అయినా.. ప్రభుత్వాదేశాలను ఖాతరు చేయకపోవడంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. ఇది అన్ని ప్రాంతాల్లోనూ ప్రభావం చూపిస్తున్న సమస్య కావడంతో రద్దయిన నోట్లను ఆమోదించాల్సిందేనంటూ ఎల్ఐసీ ఏజంట్లు కార్యాలయాల వద్ద ధర్నాలు కూడా చేస్తున్నారు. అయితే వీరు ప్రభుత్వానికి అనుకూలమైన నిర్ణయం తీసుకుంటారో లేదా ఇలాంటి ప్రెవేటు దళారీ వ్యాపారుల్లాగా నోట్లను ఆమోదించకుండా మొండిపట్టు కొనసాగిస్తారో చూడాలి.