పోలీసు చర్య ఫలించింది. అనుమతులు లేవు అనే కారణం మీద, శాంతి భద్రతలు అదుపు తప్పే ప్రమాదం ఉన్నదనే హెచ్చరికలతో పోలీసు యంత్రాంగం గట్టిగా వ్యవహరించడంతో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం తలపెట్టిన సత్యాగ్రహ పాదయాత్ర వాయిదా పడింది. పాదయాత్రకు సిద్ధం అవుతూ, ప్రారంభస్థలి రావులపాలెంకు బయలుదేరుతున్న ముద్రగడ పద్మనాభం ను పోలీసులు కిర్లంపూడిలోనే నిర్బంధించేశారు. దాదాపుగా అప్రకటిత హౌస్ అరెస్టు చేశారు. శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పాదయాత్ర వాయిదా వేసుకోవాల్సిందిగా ముద్రగడను పోలీసులు కోరారు. వారితో సుదీర్ఘ వాగ్వాదాల తర్వాత చివరికి ముద్రగడ పాదయాత్ర వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ముద్రగడ సంకల్పించిన పాదయాత్రకు సంబంధించి సుమారు వారం రోజుల నుంచి వివాదం రగులుతూనే ఉంది. సోమవారం నాడు తెలుగుపోస్ట్ ఓ ప్రత్యేక కథనాన్ని కూడా అందించింది. ప్రభుత్వ చర్యల గురించిన సమాచారంతో.. ‘ముద్రగడ సంకల్పానికి అష్టదిగ్బంధనం’ అనే శీర్షికతో ఆ కథనాన్ని అందించడం జరిగింది. యాత్రకు అనుమతులు ఇవ్వకపోగా, ఆయన నివాసం ఉన్న కిర్లంపూడిలో రెండురోజుల ముందునుంచే పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. కొత్తవారు గ్రామంలోకి రాకుండా కట్టడి చేశారు.
మొత్తానికి షెడ్యూలు ప్రకారం బుధవారం రావులపాలెంలో యాత్ర ప్రారంభించడానికి బయల్దేరిన ముద్రగడను నిర్బంధించారు. కట్టడి చేశారు. పోలీసు విన్నపాల అనంతరం ఆయన కూడా తన వాయిదా నిర్ణయాన్ని ప్రకటించారు.
గతంలో ఎందరో సమస్యల పరిష్కారం కోసం పాదయాత్రలు చేశారని, వారెవ్వరికీ అవసరం రాని అనుమతులు తన పాదయాత్రకు మాత్రం ఎందుకని ముద్రగడ ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడుగుతోంటే, పనిగట్టుకుని తమమీద ఆంక్షలు విధిస్తున్నదని ఆయన దెప్పిపొడిచారు. పోలీసులు తనను హౌస్ అరెస్టు చేశారో లేదో ఖచ్చితంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర వాయిదా వేశామే తప్ప విరమించలేదంటూ ముద్రగడ చెప్పడం విశేషం.
అంతకుముందు మరో పరిణామం కూడా జరిగింది. ముద్రగడ పాదయాత్రను అడ్డుకోవాలంటూ అనుమతులు ఇవ్వరాదంటూ హైకోర్టులో ఓ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. పాదయాత్రను నిలిపేలా తాము ఉత్తర్వులు ఇవ్వలేమని, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అయితే ఆ సంగతిని పోలీసులు చూసుకోవాలని హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే సాయంత్రానికి పాదయాత్ర వాయిదా పడిపోవడం గమనార్హం.