ముద్రగడ సంకల్పానికి అష్ట దిగ్బంధనం!

Update: 2016-11-14 18:29 GMT

కాపుల రిజర్వేషన్ లక్ష్యంగా ముద్రగడ పద్మనాభం చేయదలచుకుంటున్న దీక్షలకు ప్రభుత్వం అష్ట దిగ్బంధనం చేసేస్తోంది. ఆయన సంకల్పిస్తున్న పాదయాత్రకు అనుమతి ఇవ్వకుండా.. దానిని ఆదిలోనే అడ్డుకోవడానికి రంగం సిద్ధం అవుతోంది. రెండు రోజుల కిందట ముద్రగడ చేయదలచుకున్న పాదయాత్ర గురించి.. డీజీపీ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు, ఇవాళ సోమవారం నాడు.. అదే పాదయాత్ర గురించి సాక్షాత్తూ హోం మంత్రి చిన రాజప్ప వెల్లడించిన అభిప్రాయాలు పోల్చుకుని గమనిస్తే.. ఈ పాదయాత్రకు ఆదిలోనే చెక్ పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. మామూలుగా అయితే 16వ తేదీ ఉదయం ముద్రగడ సత్యాగ్రహ పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది.

ముద్రగడ పద్మనాభం కాపుల రిజర్వేషన్ అంశాన్ని మరుగున పడకుండా.. తరచూ తెరమీదికి తెస్తూ ప్రెస్ మీట్ లు పెడుతూ... కాపు వర్గీయులతో సమావేశాలు నిర్వహిస్తూ, ఉద్యమ కార్యచరణ గురించి ప్రణాళికలు రచిస్తూ జనంలో ఆ అంశం చర్చనీయాంశంగానే ఉండే పరిస్థితిని కాపాడుకుంటున్నారు. అయితే మరింత సంచలనాత్మకంగా కాపుల రిజర్వేషన్ అంశాన్ని మార్చాలనుకుంటున్న ముద్రగడ పద్మనాభం.. తాను పాదయాత్ర చేయాలనుకుంటున్న నిర్ణయాన్ని కూడా ఇదివరకే ప్రకటించారు. అయితే తన ఉద్యమానికి కాపు వర్గపు పెద్దలనుంచి ఏమాత్రం మద్దతు లభిస్తుందో బేరీజు వేసుకోవడానికి రెండు దఫాలు హైదరాబాదు కూడా వచ్చి కాపు ప్రముఖులతో భేటీలు నిర్వహించి, కాకినాడలో మళ్లీ భేటీలు నిర్వహించి.. మొత్తానికి ముద్రగడ తేల్చిన ఉద్యమ ప్రణాళిక పాదయాత్ర. అయితే ఈ పాదయాత్ర సాగకుండా ప్రభుత్వం ముందుగానే అష్టదిగ్బంధనం చేసినట్లు తెలుస్తోంది.

ముద్రగడ పాదయాత్రకు అనుమతులు లేవని, నిజానికి ముద్రగడ పాదయాత్రలో అసాంఘిక శక్తులు రంగప్రవేశం చేసి అల్లర్లు సృష్టించే అవకాశం కనిపిస్తోందని, తమకు ఫీడ్ బ్యాక్ ఆ రకంగా ఉన్నదని డీజీపీ సాంబశివరావు రెండు రోజుల కిందట ప్రకటించారు. ఆయన ప్రకటన ద్వారా కాపు వర్గంలో ఎలాంటి స్పందన వస్తుందో ప్రభుత్వం లిట్మస్ టెస్ట్ చేసిందని అనుకోవాలి. అసలే జనం మొత్తం నోట్ల గొడవలో పడి ఉండగా.. ముద్రగడ పాదయాత్రకు అనుమతులు లేదా, సర్కారు అడ్డుకోవడం అనే ప్రకటనల గురించి పెద్దగా ప్రతిఘటన ఎక్కడా వినిపించలేదు. తాజాగా సోమవారం మంత్రి చినరాజప్ప కూడా ఇదే సంగతి ప్రకటించారు. ముద్రగడ పాదయాత్రకు అనుమతులు లేవని, ఆయన పాదయాత్రలో అల్లర్లు జరిగితే ఆయనే మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటుందని చినరాజప్ప తేల్చేశారు. ఏతావతా పాదయాత్ర అంటూ ముద్రగడ ప్రారంభిస్తే.. దానిని వెంటనే అడ్డుకుని పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాంటి పరిణామం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ప్రతిఘటనలను వెల్లువెత్తకుండా... ఈ ప్రకటనలతో ప్రజల్ని ముందే ప్రభుత్వం ట్యూన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ముద్రగడ తన పాదయాత్ర నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నా ఆశ్చర్యం లేదని పలువురు భావిస్తున్నారు.

Similar News