చాలా కాలం కిందటే విస్తృతంగా ప్రచారంలోకి వచ్చి అంతలోనే మరుగున పడిపోయిన వదంతులు ఇప్పుడు మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. కడప జిల్లా రాజకీయాల్లో ఎంతో సీనియర్లలో ఒకరు, వైఎస్ రాజశేఖర రెడ్డికి సహచరుడు , సమకాలీనుడు అయిన ఎం. వి. మైసూరా రెడ్డి మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారనే వదంతులు షోమవారం నాడు మళ్లీ ముమ్మరంగా తెరమీదకు వచ్చాయి. తెలుగుదేశానికి చెందిన రాజ్యసభ ఎంపీ, తెరవెనుక మంత్రాంగం నడపడంలో పార్టీకి కీలకంగా ఉపయోగపడుతూ ఉండే సీఎం రమేష్ తో మైసూరారెడ్డి భేటీ కావడం అనేది ఇలాంటి పుకార్లకు బలం ఇస్తోంది.
గతంలో తెలుగుదేశం పార్టీలో ఉండగా, వైఎస్ రాజశేఖరరెడ్డికి మైసూరా చుక్కలు చూపించారు. కింగ్ ఆఫ్ కరప్షన్ పేరుతో వైఎస్ఆర్ పాలనపై తెలుగుదేశం పార్టీ పుస్తకం ప్రచురించడంలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. అయితే వైఎస్సార్ మరణం, జగన్మోహనరెడ్డి పార్టీ స్థాపించిన తరువాత చోటు చేసుకున్న నాటకీయ పరిణామాల్లో మైసూరా వైకాపాలో చేరారు. ఆ పార్టీలో సీనియర్ నాయకుడిగానే ఉన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ పోకడల పట్ల అసంతృప్తితో ఉన్నారని ఎంతో కాలం నుంచి ప్రచారం ఉన్నప్పటికీ.. సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీ పరాభవం చెందిన కొన్ని నెలలకు మైసూరా ఆ పార్టీని వీడారు. ఆ రోజు నుంచి కూడా ఆయన తెలుగుదేశం వైపు చూస్తున్నారనే ప్రచారం బాగా జరిగింది. కడప జిల్లాలో తెలుగుదేశాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబునాయుడు , ఈయన చేరిక పట్ల సుముఖంగా ఉన్నారనే వార్తలు కూడా వచ్చాయి గానీ.. అది జరగలేదు. తాజాగా మైసూరా వెళ్లి కడప జిల్లా ఎర్రగుంట్లలో సీఎం రమేష్ తో భేటీ కావడం సహజంగానే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.