ప్యాకేజీకి చట్టబద్ధతే చంద్రబాబు తాజా టార్గెట్!

Update: 2016-11-15 09:29 GMT

చంద్రబాబునాయుడు చాలా వ్యూహాత్మకంగా కేంద్రంనుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన పనులను చక్కబెట్టుకునే వ్యవహారంలో సామదానభేద దండోపాయాలను ఒక క్రమపద్ధతిలో అనుసరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా అనే వ్యవహారం మంటగలిసిపోయి.. కేంద్రంనుంచి మనకు దక్కగలదంతా ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే అని తేలిపోయిన తర్వాత.. కనీసం ఆ ప్యాకేజీకి చట్టబద్ధత సాధించి, కాస్త నిశ్చింగా పరిపాలన వ్యవహారాలు చూసుకోవాలని చంద్రబాబు ముచ్చట పడుతున్నారు.

కేంద్రంనుంచి ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధత రాబట్టడానికి ఆయన నానా పాట్లు పడుతున్నారు. తొలిరోజునుంచి కూడా ఈ ప్యాకేజీకి చట్టబద్ధత వస్తేనే సార్థకత అంటూ ఆయన అంటూనే ఉన్నారు. ఆ రకంగా సామరస్యపూర్వకంగా తమ అభీష్టాన్ని ఆయన కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. పని జరగలేదు. ‘దాన’ ఉపాయానికి షిఫ్ట్ అయినట్లుగా.. అమరావతిలో కోర్ కేపిటల్ కు శంకుస్థాపన అనే ఓ ఆర్భాటపు కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి.. ఆ కార్యక్రమానికి అరుణ్ జైట్లీని ముఖ్యఅతిథిగా ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టించారు. ఆ రకంగా ఆయనను ప్రసన్నం చేసుకోవచ్చునని భావించారు. ఆ వేదిక మీదినుంచి ప్యాకేజీకి చట్టబద్ధత గురించి విన్నవించుకున్నారు. అయితే ఎలాంటి ప్రతిస్పందన జైట్లీనుంచి రాలేదు.

ఇప్పుడు బుధవారం నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో నారా చంద్రబాబునాయుడు మూడోది అయిన భేదోపాయాన్ని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. మంగళవారం అమరావతిలో జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ విషయంలోనే పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్యాకేజీకి చట్టబద్ధత సాధించడానికి పార్లమెంటులో గట్టిగా పోరాడాలని, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీద ఒత్తిడి తీసుకురావాలని ఆయన పార్టీ ఎంపీలకు సూచించినట్లుగా తెలుస్తోంది.

ప్యాకేజీకి చట్టబద్ధత అంశంతో పాటుగా.. విశాఖపట్ణానికి రైల్వేజోన్ సాధించే అంశాన్ని కూడా పార్లమెంటులో ప్రస్తావించాల్సిందిగా చంద్రబాబు ఎంపీలకు సూచించారు. అలాగే విభజన చట్టంలోని హామీలు అన్నటినీ కూడా రాబట్టు కోవడానికి పార్లమెంటు వేదికగా ఏపీ గళం వినిపించాలని ఆయన సూచించినట్లు తెలుస్తోంది. ప్యాకేజీకి చట్టబద్ధత విషయంలో చంద్రబాబు సభాముఖంగా అడిగితే నామమాత్రంగా కూడా స్పందించని అరుణ్ జైట్లీ, పార్లమెంటులో ఎంపీలు ఓ మాట అడిగతినంత మాత్రాన పాజిటివ్ గా స్పందిస్తారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.

Similar News