‘‘బాబ్బాబూ... ఎక్కడో పగలంతా మారుమూల ఇళ్లలో పడుకుని నిద్రపోయి.. రాత్రిపూట రోడ్డు మీద చేతికర్రను తాటించుకుంటూ చప్పుడు చేసుకుంటూ.. విజిల్ ఊదుకుంటూ నేపాలీ వాడు ఎక్కడైనా తిరుగుతూ ఉంటాడర్రా.. వాణ్ని అర్జంటుగా పట్రండిరా బాబూ.. రైలెక్కించి వాడి దేశానికి పంపిద్దాం. కూడా కొన్ని సంచులు డబ్బు కూడా పంపుదాం.. అక్కడ నల్ల డబ్బుకు తెల్ల రంగేసుకోవడం ఈజీ అయిపోయేలా ఉందిరా మరి..’’
.. ఇది నల్ల కుబేరుల తాజా డైలాగు కావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకటే అనూహ్యమైన పరిణామాలలకు పర్యవసానాలకు ఎప్పటికప్పుడు పరిష్కారాలు వెతుకుతున్న క్రమంలో భాగంగా.. మోదీ సర్కారు నేపాలీలు తమ వద్ద ఉన్న భారతీయ కరెన్సీని మార్చుకోవడానికి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ ఏర్పాటును నల్లకుబేరులు తమ స్వార్థానికి వినియోగించుకునే అవకాశం లేకుండా కూడా మోదీ సర్కారు కొత్త ఆలోచనలతో కొన్ని కట్టుబాట్లు చేయాల్సి ఉంది.
వివరాల్లోకి వెళితే... మన పొరుగున ఉన్న హిందూ దేశం నేపాల్ లో భారతీయ కరెన్సీ చెల్లుబాటు అవుతుంది. పైగా నేపాల్ నుంచి లక్షలాది భారతదేశంలోనే వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటూ ఉంటారు. అయితే వారు ఇక్కడ సంపాదించిన భారతీయ కరెన్సీని మొత్తం తమ సొంత ప్రాంతాలకు తరలించుకుని అక్కడ బ్యాంకుల్లో కుదరదు గనుక.. క్యాష్ రూపంలోనే నిల్వ చేసుకుంటూ ఉంటారు. చాలా మంది దగ్గర పెద్దమొత్తాల్లో కూడా ఇలాంటి సుదీర్ఘ కాలపు సేవింగ్స్ మొత్తాలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో భారత్ లో పెద్ద నోట్ల రద్దు నేపాల్ ప్రజలకు అశనిపాతం అయ్యాయి. ఇప్పుడు ఈ నోట్లను ఏం చేసుకోవాలో తెలియక వారు ఆందోళన చెందుతుండడంతో స్వయంగా నేపాల్ ప్రధాని ప్రచండ రంగంలోకి దిగారు. ఒక అంచనా ప్రకారం నేపాల్ లో 33.6 మిలియన్ రూపాయల భారతీయ (రద్దయిన) కరెన్సీ ఉన్నట్లు తెలుస్తోంది. తమ దేశ ప్రజలు చిన్న చిన్న కూలి పనులతో సంపాదించుకున్న మొత్తాలని , దాన్ని నష్టపోకుండా చూడాలని దాదాపు అయిదు నిమిషాలు పైగా మోదీతో ఫోనులో మాట్లాడిన ప్రచండ కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడి తక్షణం ఈ సమస్య పరిష్కారానికి ఏర్పాట్లు చేస్తాం అని మోదీ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అయితే నేపాల్ లో ఆధారాల గురించి పట్టుపట్టకుండా పెద్ద మొత్తాలను కూడా మార్చుకోవడానికి అనుమతించేట్లయితే.. నేపాల్ ద్వారా తమ నల్లధనాన్ని వైట్ చేసుకోవడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అని నల్లకుబేరులు కొత్త ఆలోచనలు చేస్తున్నట్లుగా కూడా కొన్ని పుకార్లు వస్తున్నాయి. అయితే అలాంటి బెడద తలెత్తకుండా.. పటిష్టమైన కట్టుబాటు నిబంధనలతోనే నేపాలీయులు తమ సేవింగ్స్ లో ఉండే భారతీయ కరెన్సీని చెల్లుబాటు చేసుకోవడానికి మోదీ అనుమతించవచ్చునని పలువురు అనుకుంటున్నారు.