నాట్‌ మోర్‌ దేన్‌ 31 : కొత్త జిల్లాలకు తూచ్‌!

Update: 2016-10-06 11:59 GMT

అడిగిన కొద్దీ కల్పవృక్షమూ కామధేనువులాగా ఇస్తూనే ఉన్నారు కదాని.. తెలంగాణ లో చాలా ప్రాంతాల్లోని చాలా చాలా మంది నాయకులకు చిత్రమైన కోరికలు పుట్టుకొచ్చేశాయి. అంతో ఇంతో నలుగురిలో కాస్త పరిచయం ఉన్న ప్రతి నాయకుడూ కూడా.. తను ఉన్న ఊరి పరిధిలో ఒక జిల్లా ఏర్పాటు చేసేయాలంటూ ప్రభుత్వంలోని పెద్దల వెంటపడడం అనేది ఒక ఫ్యాషన్‌గా మారిపోయింది. తెలంగాణలో దసరా నాటికి కొత్త జిల్లాలు మొదలు కాబోతుందగా.. ఇంకా హైపవర్‌ కమిటీ చుట్టూ తిరుగుతూ.. తమకు కూడా తమ ఊర్లలో కొత్త జిల్లా కావాలని అడుగుతున్న నాయకులకు కమిటీ నో చెబుతోంది. ''కొత్తజిల్లా'' అనే వ్యవహారం నిన్నటితోనే ముగిసిపోయిందని , 31 జిల్లాలు ఫైనల్‌ అని, కొత్తగా డిసైడ్‌ చేసిన 4 జిల్లాల విషయంలో లోకల్‌గా మండలాలు, డివిజన్ల అభ్యంతరాలు ఉంటే మాత్రమే గురువారం స్వీకరిస్తామని కమిటీకి సారథ్యం వహించిన ఎంపీ కే కేశవరావు తేల్చిచెప్పేశారు.

కొత్త జిల్లా ప్రతిపాదనలతో తమకు వద్దకు ఎవరూ రావొద్దని కూడా ఆయన తెగేసి చెప్పేయడం విశేషం. తెలంగాణలో ఇదివరకు ప్రకటించిన 27 జిల్లాలకు అదనంగా మూడు నాలుగు రోజుల కసరత్తు తర్వాత.. కొత్తగా ఆసిఫాబాద్‌, సిరిసిల్ల, జనగామ, గద్వాల జిల్లాలు కలపాలని కేసీఆర్‌ చెప్పిన విషయం తెలిసిందే. ప్రజల అభ్యంతరాలు స్వీకరించి.. శుక్రవారం నాడు ఈ వ్యవహారాలు చూస్తున్న కేకే కమిటీ కేసీఆర్‌కు నివేదిక సమర్పించాలి. శుక్రవారం కేబినెట్‌ భేటీలో.... కొత్త జిల్లాలను ఆమోదిస్తారు.

అయితే కేకే వద్దకు ఇప్పటికీ ''మాకో జిల్లా కావాలీ'' అంటూ సినిమా స్టయిల్లో నాయకులు వెల్లువలా రావడం జరుగుతోంది. దీనితో విసిగిపోయిన కేకే.. కొత్త జిల్లా అనే మాటే తమ పరిధిలో లేదంటూ చెప్పేశారు. మండలాలు, గ్రామాల సర్దుబాటు మాత్రం చెప్పండి అని తేల్చేశారు. అయినా జిల్లాల ఏర్పాటు అంటే.. అదేదో మిఠాయిల పంపకం లాగా ప్రతి నేతలూ వచ్చి అడగడం చోద్యంగా ఉందని జనం అనుకుంటున్నారు.

Similar News