నాగం తీరు : తల చుట్టరికం.. తోక పగ!

Update: 2016-11-14 23:37 GMT

తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకుల తీరే కాస్త భిన్నం. ఒక రకంగా చెప్పాలంటే వారికి ప్రత్యామ్నాయం లేని పరిస్థితి. రాష్ట్రంలోని కేసీఆర్ సర్కారు ప్రజాకంటక పాలన సాగిస్తున్నదంటూ ప్రచారం చేయడం లక్ష్యంగా ఇక్కడి రాష్ట్ర పార్టీ నాయకులు చెలరేగిపోతూ ఉంటారు. కేంద్రం నుంచి తమ పార్టీకి చెందిన పెద్దలు, కేంద్రమంత్రులు వచ్చినప్పుడు కేసీఆర్ సర్కారుకు కితాబులు ఇచ్చేసి వెళుతుంటారు. ఇలాంటి విరుద్ధమైన వాతావరణంలో ప్రభుత్వం మీద లోకల్ గా పోరాటం సల్పడం కూడా కత్తిమీద సాములాంటిదే.

అయితే కేసీఆర్ ప్రభుత్వం మీద తొలినుంచి కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతూ ఉండే భాజపా నాయకుడు నాగం జనార్దనరెడ్డి పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉంది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం బాగా పడిపోయిందని సీఎం కేసీఆర్ గవర్నరు దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద ప్రధానితో కూడా మాట్లాడడానికి ఆయన సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయినా సరే.. మోదీ నిర్ణయానికి సహకరిస్తున్న రాష్ట్రంగానే తెలంగాణ గుర్తింపులో ఉంది. మోదీ నిర్ణయాన్ని సమర్థిస్త్తున్న పార్టీగానే తెరాస గుర్తింపు కూడా ఉంది.

ఇలాంటి సంక్లిష్టమైన నేపథ్యంలో కేసీఆర్ మీద భాజపా నాయకుడు నాగం జనార్దనరెడ్డి విరుచుకుపడుతున్నారు. నోట్ల రద్దు వలన రాష్ట్ర ఆదాయం పడిపోయిందని ఆవేదన చెందడం అర్థ రహితమని, కేసీఆరే రాష్ట్రాన్ని ఎన్నడో బీద రాష్ట్రంగా మార్చేశారని ఆయన విమర్శిస్తున్నారు. అధికార పార్టీ మీద విపక్ష నేతగా, పైగా తమ పార్టీ కేంద్రంనుంచి తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టించినందుకు ఖండించే ఆవేశంలో ఆయన కేసీఆర్ సర్కారును తిట్టడం సబబుగానే ఉంటుందిగానీ.. ఆయన చేస్తున్న ఆరోపణలే లాజిక్ లేకుండా ఉంటున్నాయి.

కేసీఆర్ రాష్ట్ర ఆదాయం పడిపోయిందని ఆందోళన చెందుతోంటే.. నల్లధనం మీద ఆధారపడి ఉన్నారా? అని నాగం జనార్దనరెడ్డి ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఇది అర్థం లేని ఆరోపణ. ఆదాయం పడిపోవడం అంటే.. అది మొత్తం నల్లధనం ద్వారా రావాలని కోరుకుంటున్నట్లు కాదు. ప్రజల వద్ద డబ్బు ఉన్నా సరే.. చెలామణీ చేయగల, ఖర్చు పెట్టగల వినియోగ వాతావరణం పెద్దనోట్ల రద్దు వలన హఠాత్తుగా పడిపోవడంతో పన్నుల రూపేణా రాష్ట్ర సర్కారుకు ఆదాయం తగ్గిపోయింది. కేసీఆర్ సహేతుకమైన వాదనే చెప్పినప్పటికీ.. దాన్ని అడ్డగోలుగా నల్లధనంతో ముడిపెట్టి నాగం విమర్శలు రువ్వుతున్నారు. కేసీఆర్ తీరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నల్లధనం మీద ఆధారపడినట్లుగా ఉన్నదని.. లాజిక్ లేని విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి అర్థరహిత విమర్శల వల్ల జనంలో తామే పలుచన అవుతామనే వాస్తవాన్ని భాజపా నేత గుర్తిస్తే బాగుంటుంది.

Similar News