నల్లకుబేరుల బుల్లి ఆచూకీ : మరో సర్జికల్ స్ట్రయిక్ కు రెడీ

Update: 2016-11-15 17:41 GMT

నల్లధనం కట్టడి చేయడానికి ప్రయత్నాలు ఇంతటితో ఆగిపోవడం లేదు... ఇంకా అనేక దశలు ఉన్నాయి అనేది ఈ మధ్య కాలంలో నరేంద్రమోదీ చెప్పిన మాట. గత వారం రోజుల్లో ఈ అంశాన్ని రెండు మూడు సందర్భాల్లో అయినా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే బ్యాంకు ఖాతాల్లో ఇబ్బడి ముబ్బడిగా జరుగుతున్న కొత్త డిపాజిట్ల రూపేణా కూడా.. ఐటీ శాఖ కొత్తగా ఆదాయపు పన్ను దాడులు చేయడానికి తగిన సమాచారం రాబడుతున్నట్లుగా తెలుస్తోంది. ఐటీ శాఖ నుంచి కొత్తగా సర్జికల్ స్ట్రయిక్స్ కు సిద్ధం అవుతున్నారంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

8వ తేదీ మోదీ ప్రకటన తరువాత.. ఆ రాత్రి నుంచి 10వ తేదీ వరకు విచ్చలవిడిగా బంగారం కొనుగోలు చేసిన వారి వివరాలను ఐటీ శాఖ ఇప్పటికే సేకరించినట్లుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వారి జాబితాలను వడపోసి, ప్రత్యేకంగా నజర్ వేసిన సంగతి బయటకు వచ్చింది.

అయితే అనూహ్యంగా ప్రధాని ఇటీవల దేశవ్యాప్తంగా సామాన్యులకు కూడా విధిగా బ్యాంకు ఖాతాలు ఉండాలనే లక్ష్యంతో ప్రారంభించిన జన్ ధన్ ఖాతాల విషయంలో కొత్త వ్యవహారాలు నడుస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. జన్ ధన్ బ్యాంకు ఖాతాలు అంటే అచ్చంగా, నిరుపేద, చిరువ్యాపారులు, సామాన్యుల కోసం జీరో బ్యాలెన్స్ తో ఖాతాలు ఇవ్వాల్సిందిగా మోదీ శ్రద్ధతో దేశవ్యాప్తంగా ఏర్పడిన ఖాతాలు. అయితే ఈ సామాన్యుల జన్ ధన్ ఖాతాల్లోకి అనూహ్యంగా లక్షల మొత్తాల్లో ఇప్పుడు డబ్బులు వచ్చి పడుతున్నాయిట. అచ్చంగా ఇవన్నీ నల్లకుబేరులు చేస్తున్న అక్రమ లావాదేవీలే అయి ఉంటాయని అనుమానిస్తున్న ఐటీ అధికారులు.. కొత్తగా డిపాజిట్లు అవుతున్న జన్ ధన్ ఖాతాల మీద కూడా చూపు సారిస్తున్నారట.

కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సామాన్యులకు హెచ్చరిక చేస్తున్నారు. వారు తమ జన్ దన్ బ్యాంకు ఖాతాల వివరాలను ఎవరికీ ఇవ్వవద్దని చెబుతున్నారు. దానివల్ల అక్రమాలను ప్రోత్సహించినట్లు అవుతుందని అంటున్నారు. అయితే ఐటీ అదికారులు ఈ ఖాతాల్లో డిపాజిట్లనుంచి సమాచారం సేకరించి.. ఆ ఖాతాదారుల ద్వారా నల్లకుబేరుల వివరాలు తీసుకుని తమ శైలిలో సర్జికల్ స్ట్రయిక్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

Similar News