కష్టాలు పడుతున్న ప్రజలకు పెద్ద ఊరట!

Update: 2016-11-15 03:21 GMT

నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు పడుతున్న నానా కష్టాల నుంచి విముక్తి కల్పించడానికి కేంద్రప్రభుత్వం, రిజర్వు బ్యాంకు చాలా చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పాత నోట్ల మార్పిడి గడువును 24వ తేదీ వరకు పొడిగించడం, దేశవ్యాప్తంగా టోల్ ఫీజులను మరికొన్ని రోజుల పాటూ రద్దు చేయడం, అలాగే రోజు వారీ నగదు మార్పిడి, బ్యాంకులనుంచి, ఏటీఎంల నుంచి విత్ డ్రాయల్ లిమిట్ లను బాగా పెంచడం వంటి చర్యలను కేవలం ప్రజల సౌకర్యార్థం బ్యాంకులు, కేంద్రం తీసుకున్న సంగతి తెలిసిందే.

నల్లధనంతో ముడిపడిన పెద్ద యజ్ఞం వంటి కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో.. కష్టాలను ప్రజలు స్వీకరిస్తూనే ఉన్నారు. అదే సమయంలో మరికొన్ని రోజులు కష్టాలు తప్పవని కేంద్రం ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూనే, వారి కష్టాలను తగ్గించడానికి కూడా కొన్ని చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఏటీఎంలలో లావాదేవీల మీద విధించే రుసుమును డిసెంబరు 30 వరకు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నిజానికి సామాన్య వినియోగదారులకు ఇది చాలా పెద్ద ఊరట అని చెప్పాలి.

కొత్త నిర్ణయం ప్రకారం.. ఏ బ్యాంకు ఖాతాదారుడు, మరే ఇతర బ్యాంకుకు సంబంధించిన ఏటీఎం నుంచి అయినా సరే, ఎన్నిసార్లు లావాదేవీలు చేసినా సరే.. దాని మీద డిసెంబరు 30 వరకు ఎలాంటి సుంకం విధించబోవడం లేదు. ఇదివరకు అయితే నెలకు ఇతర బ్యాంకుల ఏటీఎం లనుంచి పదివేలు మాత్రమే తీయాలని, అంతకు మించి తీస్తే ప్రతి లావాదేవీకి 50 రూపాయల రుసుముపడుతుందని నిబంధనలు ఉండేవి. వాటన్నిటినీ రద్దు చేశారు. అలాగే ఏటీఎం వినియోగదారులకు మరిన్ని సదుపాయాలు కూడా కలుగుతున్నాయి. ఇవాళ్టినుంచి ఏటీఎంలలో చిన్న నోట్లు కూడా అందుబవాటులోకి రానున్నాయి. కొత్త 500 నోట్లు కూడా ఏటీఎంలలోకి వస్తున్నాయి. ఏటీఎం మెషిన్ల సాఫ్ట్‌వేర్ మార్చిన తర్వాత.. 50, 20 నోట్లు కూడా ఏటీఎంలో దొరికే వెసులుబాటు కల్పిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ప్రజలకు చాలా సౌకర్యం అనే చెప్పాలి.

అలాగే చిల్లర ఇబ్బందుల నేపథ్యంలో ఎయిర్ పోర్టుల్లో పార్కింగ్ ఫీజును కూడా రద్దు చేసారు. ఇలా ఒక వైపు ప్రజలు ఎదుర్కొంటున్న రకరకాల కొత్త కష్టాలు తెరమీదికి వస్తున్న కొద్దీ... కష్టాలను తగ్గించడానికి ప్రభుత్వాలు కొత్త సవరింపులు చేస్తున్నాయి. మొత్తానికి.. నల్లదనం కట్టడి అనే ప్రయత్నాన్ని ప్రజల సహకారంతో, కృతనిశ్చయంతో ప్రభుత్వం ముందుకు తీసుకెళుతున్నట్లు కనిపిస్తోంది.

Similar News