బాబు ఎత్తుగడ.. జగన్ చిత్తవుతారా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి అడుగు వేసినా అందుకు ఒక రాజకీయ ప్రయోజనం ఉంటుంది

Update: 2023-03-21 06:15 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎలాంటి అడుగు వేసినా అందుకు ఒక రాజకీయ ప్రయోజనం ఉంటుంది. రాజకీయాలను వడపోసిన చంద్రబాబు ఏ నిర్ణయమూ అంత సులువుగా తీసుకోరు. అందుకే ఆయన నలభై ఏళ్ల నుంచి రాజకీయాలు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. ఎక్కువ రోజులు పనిచేసిన ముఖ్యమంత్రిగా కూడా రికార్డుల కెక్కారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పార్టీని చేతులోకి తీసుకున్నా దానిని మూడు దశాబ్దాల నుంచి విజయవంతంగా నడపటం ఆయనకే సాధ్యం. ఇది చంద్రబాబుపై పొగడ్తలు కావు. ఆయనకున్న రాజకీయ సమర్థత. పాలిటిక్స్ పై ఆయనకున్న గ్రిప్‌ను తెలియజేయడానికి మాత్రమే. అందుకే ప్రత్యర్థులు ఎవరూ చంద్రబాబును అంత ఆషామాషీగా తీసుకోవడానికి వీలులేదు.


ప్రతి నిర్ణయం వెనక...

చంద్రబాబు ప్రతి నిర్ణయం వెనక పార్టీ ప్రయోజనం దాగి ఉంటుంది. భవిష్యత్ లో ఉపయోగపడే నిర్ణయాలనే ఆయన తీసుకుంటారన్నది పార్టీలో ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే ఆయన నేతృత్వంలో పార్టీ 2019 ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయినా కేవలం నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీని వీడారు. ఆ ఒక్కటి చాలు ఆయనపై పార్టీ నమ్మకానికి ఉదాహరణ. ఇక తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థిని బరిలోకి దింపారు. ఎమ్మెల్యే కోటాలో ఆయనకున్న ఎమ్మెల్యేలు కేవలం 19 మంది మాత్రమే. అయినా రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మాత్రమే ఎన్నికలకు వెళుతున్నారు. మొత్తం ఏడు ఎమ్మెల్సీలకు గాను ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 23న జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలవాలంటే 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. పార్టీని వీడిన నలుగురు ఎమ్మెల్యేలు ఓటు వేస్తారన్న నమ్మకం లేదు. అంటే 19 మంది టీడీపీ ఒరిజినల్ కౌంట్. ఇక వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఓట్లు ఎటూ తమ అభ్యర్థికి వచ్చినా 21కే పరిమితం అవుతారు. కానీ మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే ఎన్నికల్లో ఏదైనా జరగొచ్చు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు గైర్హాజరయినా, హైకమాండ్‌పై అసంతృప్తితో తమకు ఓటు వేసినా టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశముంది. కానీ అది ఆశమాత్రమే. అదినెరవేరుతుందన్న గ్యారంటీ అయితే లేదు కాని, ఒక ప్రయత్నం మాత్రం చంద్రబాబు చేశారనే చెప్పాలి.

పంచుమర్తి ఎంపిక...
విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. అయితే ఈ ఎంపికలోనూ చంద్రబాబు దూరదృష్టి ఉంది. పంచుమర్తి అనూరాధ బీసీ సామాజికవర్గానికి చెందిన నేత. పద్మశాలి సామాజికవర్గానికి చెందిన వారు. ఇప్పటికే జగన్ ఆ సామాజికవర్గానికి ఎమ్మెల్సీ పదవితో పాటు నామినేటెడ్ పదవులు ఇచ్చారు. మంగళగిరిలో ఆ సామాజికవర్గం ఓట్లు ఎక్కువ. చంద్రబాబు తమ సామాజికవర్గానికి చెందిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని అక్కడి ప్రజలు వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు లోకేష్ కు అండగా నిలబడే అవకాశముంది. రాష్ట్రంలో బీసీలు కూడా కొంత సానుకూలంగా స్పందించే వీలుంటుంది. గెలిస్తే వెల్ అండ్ గుడ్. లేకుంటే చంద్రబాబు ఇచ్చినా తమ పార్టీ పట్ల సానుభూతి వచ్చే అవకాశముందన్నది చంద్రబాబు లెక్క. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏరి కోరి అనూరాధను ఎంపిక చేశారన్నది వాస్తవం. సరే ఓటమి చెందవచ్చు. విజయం సాధించవచ్చు. గెలిస్తే ఓకే. ఓడినా భవిష్యత్ లో లోకేష్ ఖాతాలో కొన్ని ఓట్లయినా పడటానికి ఈ ఎంపిక ఉపయోగపడుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.


Tags:    

Similar News