ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల భేటీ జరిగింది. దాదాపు రెండు గంటకు పైగానే జరిగిన ఈ భేటీలో పలు విషయాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. ప్రధానంగా రాజ్యసభ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపికపైనే వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగింటిలో రెండు టీడీపీకి, జనసేన, బీజేపీకి చెరొక స్థానం కేటాయించే అవకాశాలున్నాయి. ఇంతవరకూ రాజ్యసభలో జనసేనకు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈ ఖాళీ అయ్యే స్థానంలో జనసేన అభ్యర్థిని ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. తాజా రాజకీయ పరిణామాలపై కూడా చర్చించినట్లు తెలిసింది. సమావేశం ఇంతసేపు జరగడానికి ఇద్దరి మద్య సుదీర్ఘంగా రాజ్యసభ ఎన్నికలపైనే చర్చజరిగినట్లు తెలిసింది.
బీజేపీ, జనసేనలకు ...
బీజేపీకి ఖచ్చితంగా ఒక స్థానం ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉండటంతో బీజేపీ రాజ్యసభ స్థానం విషయంలో రాజీపడే అవకాశం లేదు. పెద్దల సభలో తమ బలాన్ని పెంచుకోవడానికి కమలం పార్టీ వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటుంది. ఖచ్చితంగా కేంద్ర నాయకత్వం నుంచి చంద్రబాబుపై రాజ్యసభ స్థానం విషయంలో వత్తిడి వస్తుంది. అందుకే బీజేపీకి సర్ది చెప్పే అవకాశం లేదు. మరొకవైపు టీడీపీలో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతుండటంతో ఎక్కువ మంది ఈ పదవిని ఆశిస్తున్నారు. ఈ నాలుగింటిలో ఒకటి సానాసతీష్ పదవీ కాలాన్ని మరొకసారి పొడగించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.
టీడీపీకి ఒక్కటే...
అంటే టీడీపీకి మిగిలేది ఇక ఒక్కటే. గత ఎన్నికల్లో సీనియర్ నేతలందరినీ పక్కన పెట్టారు. దేవినేని ఉమ, యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య వంటి వారు ఈ పదవులను ఆశిస్తున్నారు. అయితే సానా సతీష్ పదవి రెన్యువల్ చేస్తే జనసేన, బీజేపీలకు చెరొకటి ఇస్తే టీడీపీకి మిగిలేది ఒక్కటే. దీనివల్ల పార్టీ నేతలలో ఒకరకంగా అసంతృప్తి.. అసహనం బయలుదేరుతుంది. అందుకే పవన్ కల్యాణ్ ను ఒప్పించి ఈ సారికి సర్దుకుపోవాలని చంద్రబాబు సూచించారన్న ప్రచారం కూడా జోరుగా ఊపందుకుంది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని ఈ సమావేశంలో కోరినట్లు కూడా పార్టీ నుంచి అందుతున్న సమాచారం. మొత్తం మీద ఈ భేటీలో రాజ్యసభ సీట్ల విషయంలో క్లారిటీ రాలేదని, మరొసారి సమావేశమవ్వాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఎవరో ఒకరు రాజీపడాల్సిందేనని, టీడీపీ, జనసేనలో ఒకరు తగ్గాల్సిందేనన్న కామెంట్స్ వినపడుతున్నాయి. మరొకవైపు కూటమి పార్టీలు కలసి జిల్లాల్లో పర్యటించాలన్న దానిపై కూడా వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. తిరుమల లడ్డూ వ్యవహారం కూడా చర్చకు వచ్చింది.