రెండు తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం.. జనావాసాల మధ్య?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పులి సంచారం స్థానికులను హడలెత్తిస్తుంది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పులి సంచారం స్థానికులను హడలెత్తిస్తుంది. ఏపీలోని రాజమహేంద్రవరంలో పులి తిరుగుతుంది. దివాన్ చెరువు సమీపంలోనే పులి సంచరిస్తున్నట్లు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయింది. దీంతో అటవీ శాఖ అధికారులు ఆ ప్రాంతంలో పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. పులి అక్కడే తిరుగుతుందని, పులిని బంధించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, దానిని బంధించేంత వరకూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
తెలంగాణలోనూ....
మరొకవైపు తెలంగాణలోని జనగామ జిల్లాలోనూ పులి సంచారం స్థానికులను హడలెత్తిస్తుంది. యాదాద్రి జిల్లా నుంచి ఇక్కడకు ప్రవేశించి ఉంటుందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. పులిని బంధించడానికి ట్రాప్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు. పులి జాడ కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. అయితే పొలాలకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు తెలిపారు. పెంపుడు జంతువులను కూడా బయటకు వదలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పెద్దపులి అటవీప్రాంతానికి తిరిగి వెళ్ళేవరకు ప్రజలందరికి ముఖ్యమైన సూచనలను అటవీ అధికారులు చేశారు.
1) అటవీశాఖ వారి సూచనలను తప్పకుండా పాటించాలి
2) పులి తిరిగే ప్రాంతంలో అప్రమత్తతో ఉండాలి
3) పోలీస్, రెవిన్యూ శాఖలకు సహకరించాలి
4) వదంతులను నమ్మకుండా, స్థానిక అధికారులతో కలిసి పనిచేయాలి.
5) పులి తిరిగే ప్రాంతాలలో పశువులను తీసుకుని వెళ్ళవద్దు
6) చీకటి సమయంలో ఆరుబయట పడుకోవడం, ఒంటరిగా తిరగడం, బహిర్భూమికి వెళ్లడం చేయవద్దు.
పెద్దపులుల ప్రవర్తన ఇలా...
1) సాధారణంగా పెద్దపులులు రాత్రిపూట ప్రయాణం చేస్తాయి.
2) సాధ్యమైనంత వరకు పెద్దపులులు జనావాసాలకు, మనుషులకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాయి.
3) పులులు కేవలం పశువులను, అడవిజంతువులను మాత్రమే ఆహారంగా పరిగణిస్తాయి. మనుషుల మీద దాడిచేయడం చాలా అరుదు.
4) అనుకోని పరిస్థితిలో మనుషులు ఎదురు పడి హాని తలపెడతాయని భావిస్తేనే అవి దాడికి దిగుతాయి.